వరద ప్రభావిత ప్రాంతాల్లో మేయర్ పర్యటన
తిరుపతి: కొన్ని రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ పర్యటించారు.14వ డివిజన్ కేశవాయన గుంటలో వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను మంగళవారం మేయర్ పరిశీలించారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని, వార్డులలో ఉన్న ప్రజలు ఎప్పుడు ఏ సాయం అడిగినా అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా పేదలు నివసిస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సహాయ చర్యలను పరిశీలించిన తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, శానిటరీ సెక్రటరీ హరిబాబు, అమినిటి సెక్రటరీ సుజనశ్రీ, డి.ఈ.మహేష్, అండర్ డ్రైనేజిల సిబ్బందితో సమీక్ష నిర్వహించిన మేయర్ ప్రభుత్వ హెచ్చరికలు, అధికారుల ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వర్షాలు ఒకటి రెండు రోజులలో తగ్గే అవకాశం ఉందని… అటు పిమ్మట మన బాధ్యతలు మరింత పెరుగుతాయని అందుకు అనుగుణంగా మన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వర్షాలు ముగిసే వరకు సహాయ చర్యలు తీసుకోవాలని అటు తర్వాత అంటువ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా డ్రైనేజీ, పారిశుద్ధ్యం సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా విషజ్వరాలు వస్తాయని ముఖ్యంగా పిల్లలలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జ్వరాల బారి నుంచి బయట పడాలి అంటే వర్షాలు నిలిచిన తర్వాత పారిశుద్ధ్యం, డ్రైనేజీ విభాగం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. నిత్యం అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం దోమల మందును విసృతంగా పిచికారి చేయాలని ఆదేశించారు.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉన్న హెల్త్ సెంటర్లు వర్షాల వల్ల వచ్చే సమస్యలను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య నాయకత్వంలో అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తున్నారని మేయర్ అభినందించారు.
