TEJA NEWS

జిల్లాలో చేప పిల్లల విడుదల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన…….. మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి
               తెలంగాణ రాష్ట్రాన్ని చేపల ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా నిలపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, కాబట్టి అన్ని జిల్లాల్లో చేప పిల్లల విడుదల ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు.

               సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యసాచి ఘోష్, డైరెక్టర్ నిఖిల తో కలిసి రాష్ట్రంలో చేప పిల్లల విడుదల పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష సమావేశం నిర్వహించారు.

             ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప హాజరయ్యారు.

             ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో, పారదర్శకంగా చెరువులు, రిజర్వయర్లలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. నవంబర్ 20 లోపు అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్లాలని మంత్రి ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధుల తో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు.

          ఇప్పటికే చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభించిన జిల్లాల్లో వేగవంతం చేయాలని, ఇంకా ప్రారంభం కాని చోట త్వరితగతిన స్టార్ట్ చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రాన్ని చేపల ఉత్పత్తిలో దేశానికే ఆదర్శంగా నిలపడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. చేప పిల్లలను విడుదల చేసిన ప్రతి చెరువు, రిజర్వాయర్ వద్ద అన్ని వివరాలతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు.

           వీసీలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాట్లాడుతూ త్వరలోనే నిబంధనల ప్రకారం జిల్లాలో చేప పిల్లల విడుదల ప్రక్రియ చేపడతామని తెలియజేశారు.

          సమావేశంలో మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.