ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
…
…..
నామినేషన్ల ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం రిటర్నింగ్ అధికారి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్ స్వీకరణ ప్రక్రియకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు జరుగుతుందని, నూతన కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో పరిశీలించాల్సిన పత్రాలు, అభ్యర్థులకు అందించాల్సిన సూచనలు, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, తదితర అంశాలను ఆయన అధికారులకు వివరించారు. లోక్ సభ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి ఒకరోజు ముందు ప్రత్యేకమైన బ్యాంకు ఖాతా ప్రారంభించాలని, స్క్రూటిని ప్రారంభం కంటే ముందే అఫిడవిట్ కరెక్షన్స్, డిపాజిట్ సొమ్ము, కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. స్క్రూటినీ కంటే ఒకరోజు ముందే అభ్యర్థి ప్రతిజ్ఞ తీసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఫారం 2ఏ, అఫిడవిట్ ఫారం 26 ద్వారా సమర్పించాల్సి ఉంటుందని అన్నారు. అభ్యర్థుల ప్రతిపాదకులు తప్పనిసరిగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓటర్లుగా ఉండాలని, అభ్యర్థి వయసు, కులం వివరాలు నామినేషన్ పేపర్ పై నమోదు చేయాలని, రాజకీయ పార్టీల తరఫున నమోదు చేసే అభ్యర్థులు వారి డిక్లరేషన్ ఫారం సమర్పించాలని ఆయన అన్నారు. అభ్యర్థి అఫిడవిట్ ఫారం 26 లో పార్టీ పేరు, పార్లమెంటరీ నియోజకవర్గం పేరు, రాష్ట్రం పేరు, ఓటరు జాబితాలో పార్ట్, క్రమ సంఖ్య వివరాలు, పెండింగ్ క్రిమినల్ కేసులు వివరాలు, ఆస్తులు వివరాలు, అప్పుల వివరాలు, వృత్తి, విద్యార్హతలు, మొదలగు అన్ని వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని అన్నారు. అభ్యర్థి దాఖలు చేసిన అఫిడవిట్లో ప్రతి పేజీ పై అభ్యర్థి సంతకం చేసి ఉండాలని, అఫిడవిట్ నోటరీ చేయాలని లేదా కమీషనర్/ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేయాలని, అభ్యర్థి ఫోటో సాఫ్ట్ కాపీ, హర్డ్ కాపీ తీసుకోవాలని అన్నారు.
నామినేషన్ తీసుకున్న తర్వాత రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుంచి అఫిడవిట్ లో అన్ని కాలంలు నింపి ఉన్నాయా, ధృవీకరించిన ఓటరు జాబితా కాపీ (అభ్యర్థి ఇతర నియోజకవర్గ ఓటర్ అయితే), ఫారం ఏ, ఫారం బీ , కుల ధ్రువీకరణ పత్రం , డిపాజిట్, ప్రతిజ్ఞ అంశాలను పరిశీలించి చెక్ లిస్ట్ జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద సహాయక కేంద్రం ఏర్పాటు చేసినట్లు, ఎటువంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టంగా నామినేషన్ ప్రక్రియ సక్రమంగా జరగాలని, నామినేషన్ ప్రక్రియ లో పని చేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశాన్ని శ్రద్ధతో పరిశీలించాలని, నిర్లక్ష్యం వహించరాదని అన్నారు. నామినేషన్ దాఖలుకు అభ్యర్థులని రిటర్నింగ్ అధికారి ఛాంబర్ కు పంపడంలో, ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించాలని, బందోబస్తు విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, మిర్నల్ శ్రేష్ఠ, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, అదనపు డిసిపి ప్రసాద రావు, జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, కలెక్టరేట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు మదన్ గోపాల్, రాంబాబు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.