ఉపాధిహామీ పథకంలో వైసీపీ 13వేల అక్రమాలు చేసింది – ప్రత్తిపాటి పుల్లారావు
ఉపాధిహామీ పథకం కేంద్రం ఇచ్చిన దాదాపు 13 వేల కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్ళించిందనీ మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శాసన సభ జీరో హవర్ లో మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధిహామీ పథకంలో జరిగిన అక్రమాలను సభ దృష్టికి తెచ్చారు. టీడీపీ హయంలో పనులు చేసినవారికి బిల్లులు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం కక్ష సాధించిందని అన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో రకరకాల కొర్రీలు వేసి బిల్లులు చెల్లించకుండా వేధించారు.
వైసీపీ ఐదేళ్ల కాలంలో NREGS కింద పనులు చేసి, బిల్లులు రాక, అప్పులపాలై, ఆర్థిక బాధలు భరించలేక , అనేకమంది ఆస్తులు అమ్ముకోగా, దాదాపు 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత చొరవ తీసుకుని పెండింగ్ బిల్లులు ఇప్పటికే 331 కోట్లు చెల్లించారని, అంతేగాక 4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం అభినందనీయం అంటూ కొనియాడారు. గతంలో ఉపాధిహామీ పథకం పనుల జాబితాలో ఉన్న స్మశానవాటికల పనులను వైసీపీ హయాంలో తొలగించారని, వాటిని కూడా తిరిగి ఈ జాబితాలో చేర్చాలని ప్రత్తిపాటి పుల్లారావు ఈసందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.