TEJA NEWS

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం..!!

తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి నుండి సన్నబియ్యం పంపిణీపై తెలంగాణ సర్కార్ గతంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే హాస్టళ్లు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది.

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కోసం రాష్ట్రంలో 25 లక్షల టన్నుల మేర సన్న బియ్యం డిమాండ్‌ ఏర్పడింది. ఇప్పుడు సన్నాల సాగు పెరగడంతో డిమాండ్ కు సరిపడా సరఫరా మన రాష్ట్రంలోనే ఉండనుంది. గతంలో డిమాండ్ కు తగ్గట్టు సన్న బియ్యం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది.

ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించి సన్నాల సాగును ప్రోత్సహించడంతో ఈసారి 36.80 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. తద్వారా 88 లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా మార్చి రేషన్లో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

సన్నాల సాగును ప్రోత్సహించని గత ప్రభుత్వం

రాష్ట్రంలో 80 శాతానికి పైగా కుటుంబాలు సన్న బియ్యమే తింటున్నాయి. సన్న వడ్లకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం సన్నాల సాగును ప్రోత్సహించలేదు. గతంలో 25 నుంచి 30 శాతానికి మించి సన్న వడ్ల సాగు జరగలేదు. రైతులు కొన్నేండ్లుగా 20 లక్షల ఎకరాలకు మించి సన్నాలు సాగు చేయలేదు. మూడేండ్ల కింద అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సన్న వడ్లు వేయాలని, బోనస్ ఇస్తామని ప్రకటించింది. కానీ ఆ తర్వాత అమలు చేయలేదు.

దీంతో రైతులు సన్న వడ్లను మద్దతు ధర కంటే తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు సన్నాల సాగును చాలా వరకు తగ్గించి దొడ్డు రకాలనే సాగు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ బోనస్ ప్రకటించడంతో సన్నాల వైపు మొగ్గు చూపారు.


TEJA NEWS