TEJA NEWS

సోడిశెట్టి మంజు భార్గవి తనపై జరిగిన మోసం, వంచనపై పల్నాడు జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోంమంత్రి అనితలకు విజ్ఞప్తి

చిలకలూరిపేట: పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం, నాదెండ్ల మండలం, ఇర్లపాడు గ్రామానికి చెందిన సోడిశెట్టి మంజు భార్గవి తనపై జరిగిన మోసం, వంచనపై పల్నాడు జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేశారు. ఏఆర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర, ధర్మవరపు దుర్గాప్రసాద్ తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు విజ్ఞప్తి చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు.

బాధితురాలి ఆవేదన

సోడిశెట్టి మంజు భార్గవి తన చదువు నిమిత్తం నానమ్మ గారి ఊరైన అద్దంకికి వెళ్లినప్పుడు విశ్వభారతి జూనియర్ ఇంటర్ కాలేజీ డైరెక్టర్, దూరపు బంధువు అయిన సోడిశెట్టి రామానాయుడు తనను ప్రేమ పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడని తెలిపారు. అధిక కట్నం, ఆస్తులకు ఆశపడి తనను మోసం చేసి వేరొకరిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడని పేర్కొన్నారు. దీనిపై 2022 ఫిబ్రవరి 8న నరసరావుపేట దిశ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టగా, రామానాయుడు తల్లి సోడిశెట్టి వెంకటసుబ్బమ్మ, బంధువులు ధర్మవరపు దుర్గాప్రసాద్, మేకల నరేంద్ర (ఏఆర్ కానిస్టేబుల్) వచ్చి పెళ్లి చేస్తామని నమ్మబలికి తీసుకెళ్లారని వివరించారు.

బలవంతపు వివాహం, బెదిరింపులు

బంధువులు కావడంతో వారి మాటలు నమ్మి తాను వెళ్లగా, తన అత్తగారు సోడిశెట్టి వెంకటసుబ్బమ్మ, ఇతర బంధువులు రామానాయుడు కంటే అతని తమ్ముడు సోడిశెట్టి కామేశ్వరరావును పెళ్లి చేసుకోవాలని, అతను ఏ లోటూ లేకుండా చూసుకుంటాడని చెప్పారని మంజు భార్గవి తెలిపారు. తాను అంగీకరించకపోయినా, బలవంతం చేసి బెదిరించి, రామానాయుడు సోదరుడు కామేశ్వరరావుతో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో గుడిలో వివాహం చేశారని పేర్కొన్నారు.పెళ్లయిన మూడు రోజుల తర్వాత అద్దంకికి వచ్చామని, ఆ తర్వాత 16 రోజుల పండుగకు వస్తానని చెప్పి తన భర్త వెళ్లిపోయాడని, అప్పటినుంచి రామానాయుడు అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్‌లు పెడుతూ, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయం తన భర్తకు చెప్పగా, తన అన్న గురించి ఏమి చెప్పినా విననని, తనకు తగిన శాస్తి చేశామని ఫోన్ పెట్టేశాడని, అత్తయ్యకు చెబితే తనకు తెలియదని, ఏంచేసుకుంటావో చేసుకోమని బెదిరించిందని బాధితురాలు వాపోయారు.

నిరాదరణ, తప్పుడు ప్రచారం

చేయగలిగింది ఏమీ లేక తన పుట్టిల్లు అయిన ఇర్లపాడు గ్రామం వచ్చి పెద్దలతో చెప్పగా, అత్తింటివారు “వాడు ఎక్కడున్నాడో తెలియదు, వెతుకుతున్నాం” అని 14 నెలలు కాలయాపన చేశారని మంజు భార్గవి తెలిపారు. 2023 ఏప్రిల్ 27న తన తల్లిదండ్రులు, తమ్ముళ్లతో కలిసి అత్తవారింటికి వెళ్లగా, అత్తయ్య బంధువులతో మాట్లాడి తన భర్త వచ్చే వరకు అక్కడే ఉంటానని చెప్పి, తన తల్లిని కూడా తనతో ఉండేలా చేసి తన తల్లిదండ్రులు వెళ్లారని వివరించారు. తెల్లవారేసరికి అత్తయ్య చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లారని, అప్పటినుంచి తాను, తన తల్లి అక్కడే ఉంటున్నామని పేర్కొన్నారు.
అయినా రామానాయుడు, ధర్మవరపు దుర్గాప్రసాద్, ఏఆర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర అద్దంకి పట్టణంలో తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2023లో తనపై, బంధువులపై ఫిర్యాదు చేసినట్లు ఇటీవల అద్దంకి పోలీసులు చెప్పేవరకు తమకు తెలియదని, పోలీసులు ఫోన్లు చేసి తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర, ధర్మవరపు దుర్గాప్రసాద్ మనుషులను వెంటబెట్టుకొని వచ్చి విడాకులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని, లేకపోతే తమను, తమ బంధువులను ఇబ్బంది పెడతామని, మేనమామ పిల్లలు విదేశాలకు వెళ్లకుండా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలిపారు.

ఫోన్ హ్యాకింగ్, హత్యాయత్నం

తాను ఏమి తప్పు చేశామని జైలుకెళ్లాలని ప్రశ్నించిన మంజు భార్గవి, తన అత్తగారింటికి వెళ్లినప్పటినుంచి ధర్మవరపు దుర్గాప్రసాద్, మేకల నరేంద్ర, తన భర్త కామేశ్వరరావు, రామానాయుడు కలిసి తన ఫోన్‌ను హ్యాక్ చేసి, తనకు సంబంధం లేకుండా తన ఫోన్ నుంచి మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వెళ్లేటట్టు చేసి తనను చెడ్డదానిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. పలుమార్లు రామానాయుడు, తన అత్తయ్య ప్రోద్బలంతో ఏఆర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర, ధర్మవరపు దుర్గాప్రసాద్ తనపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.

న్యాయం కోసం పోరాటం

రామానాయుడు, ఏఆర్ కానిస్టేబుల్ మేకల నరేంద్ర, ధర్మవరపు దుర్గాప్రసాద్ ల వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనపై, తన కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టిస్తూ ఇబ్బంది పెడుతున్నారని మంజు భార్గవి ఆవేదన వ్యక్తం చేశారు. గోవింద అంబిక జూనియర్ కాలేజీ డైరెక్టర్‌గా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రామానాయుడు, సమాజ రక్షణ విభాగంలో ఉద్యోగం చేస్తున్న నరేంద్ర, ధర్మవరపు దుర్గాప్రసాద్ లు ముగ్గురూ కలిసి ఆడపిల్లలకు చేస్తున్న అన్యాయాలు నలుగురికీ తెలియాలని, తన జీవితం నాశనమైనట్లుగా మరే ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా తనకు న్యాయం చేయాలని గౌరవ పల్నాడు జిల్లా ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తానని, మీడియా సహకరించాలని కోరారు.

తనలా ఏ ఆడపిల్లలకు అన్యాయం జరగకుండా ఉండాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హోంమంత్రి అనితలకు విజ్ఞప్తి చేస్తూ వీడియో విడుదల చేస్తున్నానని, దయచేసి మీడియా వారందరూ సహకరించి ఈ వీడియో వారికి చేరేవరకు షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.