టీటీడీ చైర్మన్ కు రాష్ట్ర టీడీపీ నేత వినతి
తిరుపతి: తిరుమలలో సన్నిధి గొల్ల అయిన శరభయ్య యాదవ్ విగ్రహం, మఠం ఏర్పాటు చేయాలని యాదవ సంక్షేమ- అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, వాసుదేవ యాదవ్ టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బిఆర్) నాయుడుకి వినతిపత్రం సమర్పించారు. తిరుమలలో జరిగిన టీటీడీ బోర్డు మీటింగ్ లో ఆమేరకు నరసింహ యాదవ్ చైర్మన్ నాయుడుకు విన్నవించారు.
ఈ సందర్భంగా నరసింహ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ
పూర్వం చరిత్ర ప్రకారం భూలోకంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వర స్వామీగా తిరుమలలో అడుగు పెట్టగానే సన్నిధిగొల్ల మొదటి దర్శనం చేసుకోవడం…. తెలిసిందే అన్నారు. ఇంత చరిత్ర ఉన్న సన్నిధి గొల్ల శరభయ్య యాదవ్ విగ్రహాన్ని తిరుమల లో ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. మొట్టమొదట స్వామివారిని శరభయ్య యాదవ్ చూశారు కానీ ఆయన తర్వాత స్వామివారితో అనుబంధమున్న వారి విగ్రహాలు ఏర్పాటు చేశారు కానీ ఇంతవరకు సన్నిధి గొల్ల శరభయ్య విగ్రహాన్ని మరియు శరభయ్య యాదవ్ మఠం నిర్మించకపోవడం పై యావత్ యాదవులందరూ చింతిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం చొరవతో యాదవులందరి కోరికను తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొల్ల నరసింహ యాదవ్, జంగా కృష్ణమూర్తి యాదవ్, వాసుదేవ యాదవ్ సేవా సంఘం సభ్యులు, కట్ట జయరాం యాదవ్, రామచంద్ర యాదవ్, ఈతమాకుల హేమంత్ యాదవ్, చింతా భరణి యాదవ్, చింత చెంగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
