కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు

కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు

TEJA NEWS

అమరావతి: కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఏపీ గవర్నర్‌, కేంద్ర హోం మంత్రికి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని భయపెట్టే చివరి ప్రయత్నమే. ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి. వైకాపా హింసాత్మక చర్యలకు మరో 50 రోజుల్లో ముగింపు పలుకుతాం’’ అని పేర్కొన్నారు.

వైకాపా మూకదాడి అమానుషం: వైఎస్‌ షర్మిల

కర్నూలులోని ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై వైకాపా మూక దాడి అమానుషమని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఇటీవల రాప్తాడులోఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై దాడిని ఖండిస్తున్నట్టు చెప్పారు. ‘‘పత్రికా స్వేచ్ఛను వైకాపా హరిస్తోందనడానికి ఈ దాడులే నిదర్శనం. నిజాలు జీర్ణించుకోలేక నిందలు మోపడం, దాడులకు దిగడం, కొట్టి చంపడం అధికార పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. జర్నలిస్టులు, పత్రికా కార్యాలయాలపై దాడులకు పాల్పడటం వైకాపా పాలనలో నిత్యకృత్యం. పత్రికా ప్రతినిధులపై దాడి అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్టే. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని షర్మిల డిమాండ్‌ చేశారు. 
జగన్‌ కాలకేయ సైన్యం

మీడియాపై దాడులకు దిగుతోంది: లోకేశ్‌

సైకో జగన్‌ కాలకేయ సైన్యం మీడియానే లక్ష్యంగా దాడులకు తెగబడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో పేర్కొన్నారు. ‘‘రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్‌ని అంతం చేయడానికి ప్రయత్నించింది. ఇప్పుడు ఏకంగా ఈనాడు కర్నూలు కార్యాలయంపైకి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైకాపా రౌడీ మూకల్ని వదిలారు. నిష్పాక్షిక సమాచారం అందించే ‘ఈనాడు’ లాంటి అగ్రశ్రేణి దినపత్రిక కార్యాలయంపై దాడులకు తెగబడటం రాష్ట్రంలో ఆటవిక పాలనకు పరాకాష్ట. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి మీడియాపై సైకో జగన్‌ ఫ్యాక్షన్‌ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని తెలిపారు.

దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్‌ అనుసరిస్తున్నారు: అచ్చెన్నాయుడు

వైకాపా పాలనలో పత్రికా స్వేచ్ఛకు సమాధి కట్టారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని ఆయన ఖండించారు. ‘‘విలేకరులు, సంస్థలపై దాడులు చేసే నీచ సంస్కృతిని జగన్‌ అనుసరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలతో వేధిస్తున్నారు. పత్రికా కార్యాలయంపైనే దాడి జరిగితే.. సామాన్యులకు ఏం రక్షణ ఉంటుంది? ఈనాడు కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? నిందితులపై చర్యలు తీసుకోవాలి. జగన్‌ అరాచకాలకు వడ్డీతో సహా బదులు చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’’ అని అన్నారు. 

అరాచకాలపై జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి: సీపీఐ రామకృష్ణ

‘ఈనాడు’ కార్యాయంపై పాణ్యం ఎమ్మెల్యే కాటసాని అనుచరుల దాడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఖండించారు. ‘‘ఇటీవల రాప్తాడులో ఆంధ్రజ్యోతి జర్నలిస్టుపై, తాజాగా కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడి దుర్మార్గమైన చర్య. పోలీసుల సమక్షంలోనే వైకాపా మూకలు బీభత్సం సృష్టించడం రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతోంది. పత్రికా స్వేచ్ఛను హరించేందుకు జగన్‌ ప్రభుత్వం పావులు కదుపుతోంది. భౌతిక దాడులతో జర్నలిస్టులను భయబ్రాంతులకు గురిచేసే దుశ్చర్యలకు పాల్పడటం గర్హనీయం. అరాచకాలపై జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

నిందితులను అరెస్టు చేయాలి: ఏపీడబ్ల్యూయూజే

కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని ఏపీడబ్ల్యూయూజే ఖండించింది. ‘‘వైకాపా పాలనలో పత్రికా స్వేచ్ఛకు ముప్పు వాటిల్లింది. దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి’’ అని యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS