కూటమి మేనిఫెస్టోను ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో కూటమి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టో విడుదలపై స్పష్టత ఇచ్చారు. తమ మేనిఫెస్టో చూస్తే ప్రజల కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని చెప్పారు. ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని, లేని పక్షంలో ప్రజలకే నష్టమని చెప్పారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను సైతం దోచుకున్నారని ఆరోపించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి నియోజకవర్గాల్లోకి ఇతరులను రానివ్వారని, వాళ్లు మాత్రం ఎక్కడికైనా వస్తారని, ఏ జిల్లాలోనైనా దోచుకుంటారని పవన్ మండిపడ్డారు. అరటి తొక్కలాంటి జగన్ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో వేయండని పిలుపునిచ్చారు. వైసీపీకి ఓటేస్తే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లేనని పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. నియోజవకర్గానికి హాని చేసే ఏ నేతనైనా నిలదీయాలని సూచించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఓట్లు అడుతున్నారని పవన్ కల్యాణ్ ఎద్దేవాచేశారు. అసలు చలమలశెట్టి సునీల్‌కు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. తాము గెలిస్తే గిరిజనుల తరపున అసెంబ్లీలో పోరాడతామని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.