వైద్య, ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలి
-డెంగ్యూ మృతులకు పరిహారం చెల్లించాలి
-గ్రామ గ్రామాన వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలి
-తీరు మారకుంటే ప్రభుత్వ ఆసుప్రతుల ముందు ఆందోళన
-సి.పి.ఐ నేత బాగం
వైద్యఆరోగ్యశాఖను ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ప్రక్షాళన చేయాలని, వైద్యసేవలందించడంలో ప్రభుత్వాసుపత్రులు విఫలమయ్యాయని సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ వైద్యం పొందలేక, ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందక ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సి.పి.ఐ అనుబంధ ప్రజా సంఘాల సంయుక్త సమావేశం గురువారం స్థానిక సి.పి.ఐ జిల్లా కార్యాలయం గిరిప్రసాదప్రసాద్భవన్ లో సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ప్రతి ఇంట్లోను జ్వర పీడితులున్నారని విషజ్వరాలు, చికెన్గున్యా, డెంగ్యూ వ్యాధులు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయని, ఒక సారి జ్వరం వస్తే రెండు నెలల పాటు కనీసం ఇంట్లోకూడా పనిచేసే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఇప్పటికే ఒక్క ఖమ్మం జిల్లాలోనే సుమారు 50 మంది డెంగ్యూతో మృతి చెందారని హేమంతరావు తెలిపారు. డెంగ్యూతో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్రేషియా ప్రకటించాలని హేమంతరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు సరఫరా కావడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయని అవసరమైతే ప్రభుత్వా ఆసుపత్రులకు సంబంధించి స్టాక్ రిజిష్టర్ను బహిర్గతం చేయాలని ఆయన కోరారు. సిబ్బంది పని విధానంలో మార్పురాలేదని వృత్తిపట్ల నిబద్దత కొరబడిందని ఇప్పటికీ కొందరు విధులకు హాజరు కావడంలోను, వైద్యసేవలందించడంలో నిర్లక్ష్యధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆసుప్రతులు కొన్ని కాసుపత్రులుగా మారి ప్రజలను దోపిడీ చేస్తున్నాయి వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని హేమంతరావు డిమాండ్ చేశారు. వైద్యసేవలను ప్రభుత్వ పరంగా మరింత విస్తరించాలని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని లేని పక్షంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ముందు ఆందోళన చేపడుతామని ఆయన హెచ్చరించారు. గ్రామగ్రామాన వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగిడుతున్నవేళ ప్రజా సంఘాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిశంబర్ 26వ తేదీలోపు అన్ని ప్రజా సంఘాల నిర్మాణాన్ని పూర్తిచేసుకొని బలమైన ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. ప్రజా సంఘాలు, ఆయా సంఘాల పరిధిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని హేమంతరావు సూచించారు. ప్రజా సంఘాలు బలంగా పనిచేసినప్పుడు ప్రజలకు సానుకూల ఫలితాలు అందుతాయన్నారు. ఈ సమావేశంలో మహిళసమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి, వ్యవసాయకార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తాటి వెంకటేశ్వరరావు వివిధ ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.