TEJA NEWS

ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పదవీ ప్రతిపక్షానికి దూరమే!

11 మంది బలంతో వైకాపాకు ఆ అవకాశం లేదు..

అమరావతి: రాష్ట్రంలో కీలకమైన ప్రజాపద్దుల కమిటీ (పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీ) ఛైర్మన్‌ పదవి ప్రతిపక్ష వైకాపా(YSRCP)కు దక్కే ఆస్కారం లేకుండా పోయింది..

ఈ కమిటీలో సభ్యుడిగా ఎన్నిక కావాలన్నా 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ప్రస్తుతం వైకాపాకు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీ ఛైర్మన్‌గా శాసనసభాధ్యక్షులు ఎవరిని నియమిస్తారనేది ఆసక్తికరం.

ప్రజాపద్దుల కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు గురువారం మధ్యాహ్నం ఒంటిగంట వరకు అవకాశం ఉంది. అవసరమైతే ఆ తర్వాత ఎన్నిక ఉంటుంది. ప్రజాపద్దుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటారు. శాసనసభ నుంచి 9మంది, మండలి నుంచి ముగ్గురు ఉంటారు. శాసన సభ్యుల నుంచే ఛైర్మన్‌ నియమితులవుతారు. శాసనసభాధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకుంటారు. కిందటి శాసనసభలో ప్రతిపక్ష తెలుగుదేశానికి ఒక్క సభ్యుడినే ఎన్నుకునేంత బలం ఉంది. దీంతో పయ్యావుల కేశవ్‌కు ఆ సభ్యుడిగా అవకాశం దక్కింది. సంప్రదాయం ప్రకారం ఆయననే ఛైర్మన్‌గా నియమించారు. ప్రస్తుతం ప్రతిపక్ష వైకాపా నుంచి ఒక్క సభ్యుడూ ఎన్నికయ్యే ఆస్కారం లేకపోవడంతో ఈ ఛైర్మన్‌ పదవి ఎవరికి దక్కుతుందనే ఆసక్తికర చర్చ జరుగుతోంది..


TEJA NEWS