యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి సమాయత్తం చేసిన తీరు అద్భుతం
- ఆయన ముందస్తు చర్యల వల్లే ముప్పు నివారించగలిగాం
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు
- తుపాను సహాయక చర్యలపై ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జి మంత్రి & రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుపానును ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అద్భుతంగా సమాయత్తం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇన్చార్జి మంత్రి & రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తుపాను సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తో కలసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ…. ముఖ్యమంత్రి యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసి, అన్ని విధాలుగా సంసిద్ధుల్ని చేశారని చెప్పారు. ఆ సన్నద్ధత కారణంగానే తుపానును సమర్థవంతంగా ఎదుర్కొని, ఆస్తి ప్రాణ నష్టాలను నివారించ గలిగామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని, లోతట్టు ప్రాంతాలు, తుపాను ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేసి ఏ సమస్య వచ్చినా సత్వరం పరిష్కరించగలిగేలా చూశారని చెప్పారు. బుడమేరు, ప్రకాశం బ్యారేజీలలో ఇన్ ఫ్లో తక్కువగానే ఉందని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు. పాము కాటు మందు సహా, అన్ని రకాల ఔషధాలను అందుబాటులో ఉంచామన్నారు.
ఈ సమావేశంలో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
(సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి వారి కార్యాలయం, ఎన్టీఆర్ జిల్లా నుంచి జారీ)
