TEJA NEWS

హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని 29 కాపు, మున్నూరు కాపు సంఘాల నాయకులు, ప్రతినిధులు, జెఎసిల ప్రతినిధులు శనివారం మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆధ్వర్యంలో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాపు సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వపరంగా వారికి అందించాల్సిన సహాయ, సహకారాల గురించి మంత్రి సురేఖకు వారు వివరించారు. బిసిల ఉన్నతికి, కాపు సమాజ పురోగతికి ప్రభుత్వపరంగా, వ్యక్తిగతంగా మంత్రి సురేఖ అందిస్తున్న చేయూతను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంలో మంత్రి సురేఖ చేసిన కృషిని అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, కాపుల పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని మంత్రి తెలిపారు. రాష్ట ప్రగతిలో ముఖ్య భూమికను పోషిస్తున్న కాపులు, మున్నూరు కాపులకు చాలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తపిస్తున్నారని మంత్రి సురేఖ పేర్కొన్నారు. అతి త్వరలో మున్నూరు కాపు కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించి, కాపు సమాజం సంక్షేమం, అభివృద్ధి పై పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు


TEJA NEWS