వైసీపీ పాలనలో అడ్డగోలుగా విద్యుత్ చార్జీలు పెంచి, నిరసనల పేరుతో నేడు డ్రామాలా..!! అంటూ మండిపడ్డ ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గత వైసీపీ ఐదేళ్ళ పాలనలో అడ్డగోలుగా అనేకసార్లు విద్యత్ చార్జీలు పెంచిన విషయాన్ని మరచి, ఇప్పుడు తగ్గించాలని నిరసన పేరుతో డ్రామాలు ఆడుతున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. “విద్యుత్ చార్జీలు పెంచారంటూ” వైసీపీ నేతలు చేస్తున్న నిరసనలను ఖండిస్తూ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మీడియాతో మాట్లాడుతూ …. ఈ రోజు వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు గుజ్జనగుండ్ల విధ్యుత్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేసి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద బురద చల్లటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
ప్రజల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ, మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నేతలు వారి హయంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై రూ. 32,000 కోట్ల రూపాయల విద్యుత్ భారం వేశారన్నారు.
వైసీపీ ఐదేళ్ళ పాలనలో అడ్డగోలుగా అనేకసార్లు విధ్యుత్ చార్జీలు పెంచిన విషయాన్ని మరచి ఇప్పుడు తగ్గించాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రజలు అన్నీ విషయాలు గమనిస్తున్నారన్నారని, అవినీతి, అక్రమాల కేసుల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నిరసన కార్యక్రమాల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, సౌరవిద్యుత్ ఒప్పందాల్లో ముడుపులు కేసుల్లో అమెరికాలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి పోరుబాట పేరిట ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే గళ్ళా మాధవి మండిపడ్డారు.