TEJA NEWS

ప్రపంచవ్యాప్తంగా నీటి కాలుష్యం, కొరత

మూడో వంతు నదులకు కాలుష్య ముప్పు

పరీవాహక ప్రాంత ప్రజలకు పెను ఇక్కట్లు

హెచ్చరిస్తున్న అంతర్జాతీయ అధ్యయనం

నీటి కొరతతో ఇప్పటికే ప్రపంచం అల్లాడుతోంది

పలు దేశాల్లో ఈ సమస్య ఉగ్ర రూపు దాలుస్తోంది. తాగునీటి సమస్య యూరప్, ఆఫ్రికాల్లో పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారి తీస్తోంది. కొరతకు నీటి కాలుష్యమూ తోడవడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. అయితే ఇదంతా ట్రైలర్‌ మాత్రమేనని, సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెను ఊపు దాల్చవచ్చని తాజా అధ్యయనం తేలి్చంది

2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరీవాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది! ఇది కనీసం 300 కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయడం గుబులు రేపుతోంది… నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్‌లోని వాగెనింగెన్‌ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది

చైనా, మధ్య యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికాతో పాటు భారత్‌లోని మొత్తం 10 వేల పై చిలుకు సదీ బేసిన్లు, సబ్‌ బేసిన్లలో నీటి నాణ్యత తదితరాలపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది. వాటిలో ఏకంగా మూడో వంతు, అంటే 3,061 నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోనుందని హెచ్చరించింది. ఆయా బేసిన్ల పరిధిలోని జల వనరుల్లో నైట్రోజన్‌ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. వాటిలో నైట్రోజన్‌ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోందని తేలి్చంది. దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవచ్చని స్పష్టం చేసింది. జర్నల్‌ నేచర్‌ కమ్యూనికేషన్స్‌లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి…

అధ్యయనం ఇలా…

ఆయా నదీ బేసిన్లు, సబ్‌ బేసిన్లలో నీటి ప్రవాహం, పరిమాణాన్ని లెక్కలోకి తీసుకున్నారు

వాటిలో కలుస్తున్న నైట్రోజన్‌ పరిమాణాన్ని నీటి పరిమాణంతో పోల్చి కాలుష్య స్థాయిని లెక్కించారు

2010 నుంచి చూస్తే గత 13 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని నదీ బేసిన్లు, సబ్‌ బేసిన్లలోనూ నైట్రోజన్‌ పరిమాణం క్రమంగా పెరుగుతూ వస్తున్నట్టు తేలింది

2010లో నాలుగో వంతు బేసిన్లలో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు మూడో వంతుకు విస్తరించింది. పైగా వాటి కాలుష్య కారకాల్లో నైట్రోజన్‌ పాత్ర ఏకంగా 88 శాతానికి పెరిగింది!

ఏం జరుగుతోంది…

నదీ బేసిన్లు, సబ్‌ బేసిన్లు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు. భారీ స్థాయి పట్టణీకరణకు, ఆర్థిక కార్యకలాపాలకు కూడా కేంద్ర బిందువులు కూడా

ఫలితంగా భారీగా ఉత్పత్తయ్యే మురుగునీరు చాలామటుకు వాటిలోనే కలుస్తోంది

మురుగులోని నైట్రోజన్‌ కారణంగా నీటి వనరులు బాగా కలుషితమవుతున్నాయి

ఇది కూడా జల వనరుల కాలుష్యంలో పెద్ద కారకంగా మారుతోంది.

దీనికితోడు బేసిన్ల పరిధిలో వ్యవసాయ కార్యకలాపాలు భారీగా సాగుతాయి. అది విచ్చలవిడి ఎరువుల వాడకానికి దారి తీస్తోంది

పెను సమస్యే…

అధ్యయనం జరిపిన 10 వేల పై చిలుకు నదీ బేసిన్లు ప్రధానంగా సాగుకు ఆటపట్టులు
ప్రపంచ జనాభాలో ఏకంగా 80 శాతం దాకా వాటి పరిధిలోనే నివసిస్తోంది!

2050కల్లా మూడో వంతు, అంటే కనీసం 300 కోట్ల పై చిలుకు జనం తాగునీటి సమస్యతో అల్లాడిపోతారు

ఈ నీటి వనరులు పూర్తిస్థాయిలో తాగటానికి పనికిరాకుండా పోతే సమస్య ఊహాతీతంగా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది.

ఉత్తర అమెరికా, యూరప్, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, మధ్య ఆసియా, చైనాతో పాటు భారత్‌లోనూ పలు ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి!


TEJA NEWS