వర్షపు నీరు నిలవకుండా సజావుగా వెళ్లేలా అన్ని చర్యలు చేపడుతున్నాం.
లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం.*
కమిషనర్ ఎన్.మౌర్య
తుఫాన్ తో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపైకి, లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్లి ఆగకుండా ప్రత్యేక మార్గాల్లో గుంటల్లోకి వెళ్లేలా అన్ని చర్యలు చేపట్టామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. తుఫాన్ ప్రభావంతో నుండి కురుస్తున్న వర్షాలతో నగరంలోని అన్ని డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, రోడ్లపైకి నీరు రాకుండా చేస్తున్న పనులను, లోతట్టు ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యలను అధికారులతో కలసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని లోతట్టు ప్రాంతాలైన కొరమేనుగుంట, ఆటోనగర్, తదితర ప్రాంతాల్లో వర్షపునీరు వచ్చాయని అన్నారు. ఆ నీరు బయటకు వెళ్లేలా ప్రత్యామ్నాయంగా కాలువలు తీసి నీరు లోనికి రాకుండా చేస్తున్నామని అన్నారు. ఇక్కడి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు.
కపిలతీర్థం, మాల్వాడి గుండం నుండి నీరు వస్తే నగరంలో నీరు ఆగే అవకాశం ఉందన్నారు. ఐతే ప్రస్తుతం జెసిబి ల ద్వారా అన్ని ప్రాంతాల్లో డ్రెయినేజీ కాలువల్లో పూడికతీత పనులు చేశామని, అందువల్ల నీరు నిలిచే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం కూడా ఈ ప్రక్రియను ప్రతి రోజు కొనసాగిస్తున్నామని అన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, అండర్ బ్రిడ్జి ల వద్ద నీరు నిలవడంతో మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు తొలగింపు పనులు చేపట్టామని అన్నారు. నగరంలో విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా విద్యుత్ తీగలకు అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియను చేస్తున్నామని అన్నారు. కోరమేనుగుంట, ఉప్పంగి హరిజనవాడ తదితర ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలించి వారికి తాగునీరు, ఆహారం, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు, పారిశుధ్యం తదితర సదుపాయాలను
కల్పించామని అన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నమని అన్నారు.
లోతట్టు ప్రాంతాలలోని ప్రజలు వర్షాల నేపధ్యంలో ఏమైనా సమస్యలు వస్తే హెల్ప్ లైన్ నంబర్ 0877 2256766 ను సంప్రదిస్తే తమ సిబ్బంది సాయం అందిస్తారని తెలిపారు. ప్రజలంతా వర్షాలకు ఇండ్లలోనే ఉండి రక్షణ పొందాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయట రావాలని కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసికుమార్, గోమతి, సి.పి. ఓ. దేవి కుమారి, తహసీల్దార్ భాగ్యలక్ష్మి, రెవెన్యూ ఆఫీసర్ సేతిమాధవ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, పోలీసు, తదితర విభాగాల అధికారులు ఉన్నారు.