33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి.. సునీతా రావు.
భాజపా కార్యాలయం ముట్టడికి మహిళా కాంగ్రెస్ యత్నం.. అడ్డుకున్న పోలీసులు
మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు, కార్యకర్తలను గాంధీభవన్ గేట్ ముందు బారికేడ్లు అడ్డుపెట్టి నిలువరిస్తున్న పోలీసులు
హైదరాబాద్, న్యూస్‌టుడే: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన మహిళా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. జాతీయ మహిళా కాంగ్రెస్ పిలుపులో భాగంగా బుధవారం రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు నేతృత్వంలో కార్యకర్తలు హైదరాబాద్ గాంధీభవన్ మెట్లపై కూర్చొని నిరసన చేపట్టారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రధాని మోదీకి, భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం భాజపా కార్యాలయం ముట్టడికి బయలుదేరగాపోలీసులు గాంధీభవన్ గేట్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టి వారు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సునీతారావు మాట్లాడుతూ నారీ న్యాయ్ హక్కు సాధించే వరకు పోరాటం చేస్తామన్నారు.