TEJA NEWS

విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్

ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి మరియు అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులతో విశాఖ రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐపిఎస్ విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మే 16న సమీక్షా సమావేశం మరియు జూమ్ మీటింగు నిర్వహించారు.

ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని, ఐసిఎఎన్ మాట్లాడుతూ – గత రెండు మాసాలుగా రేంజ్ పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది చాలా కష్టపడి, ప్రణాళికాబద్ధంగా క్షేత్ర స్థాయిలో సమర్ధవంతంగా పని చేయడం వలన ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించుకోగలిగామని, అందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఎన్నికల తరువాత మన ప్రాంతం ప్రశాంతంగా ఉందన్న నిర్లక్ష్యం వద్దని, మరో 15రోజులు ప్రతీ ఒక్కరూ ఇదే స్ఫూర్తి, నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, మన ప్రాంతంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా క్షేత్ర స్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలింగుకు కొద్ది రోజులు ముందు, పోలింగు రోజు, పోలింగు తరువాత గ్రామాల్లోచోటు చేసుకున్న చిన్న చిన్న సంఘటనల పట్ల నిర్లక్ష్యం వద్దని, ఆయా గ్రామాలను అధికారులు పలుమార్లు సందర్శించాలని, గ్రామ పెద్దలు, గ్రామస్థులతో మమేకమై, వారిని వివాదాలకు దూరంగా ఉండాలని, ఒకరితో ఒకరు శాంతియుతంగా మెలగాలని విజ్ఞప్తి చేయాలన్నారు. గ్రామాల్లో చురుకుగా ఉన్న వ్యక్తులను, రాజకీయంగా వివాదాలు సృష్టించే వ్యక్తులను గుర్తించి, వారిని పోలీసు స్టేషనుకు పిలిచి, కౌన్సిలింగు చేయాలని, క్షేత్ర స్థాయిలో రాజకీయ పార్టీలకు అతీతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులను విశాఖపట్నం రేంజ్ డిఐజి ఆదేశించారు. ఓటు వేసేందుకు ఇతర ప్రాంతాల నుండి స్వగ్రామాలకు వచ్చిన వ్యక్తులు వలన ఏమైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న వారిని గుర్తించి, వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టాలన్నారు. అదే విధంగా వివాదాలు తలెత్తేందుకు అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి, పోలీసు పికెట్లును ఏర్పాటు చేయాలని, ఆయా గ్రామాల్లో పరిస్థితులను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలపాలన్నారు. గ్రామాల్లోకి క్రొత్తగా వచ్చే వ్యక్తులను గుర్తించి, వారు గ్రామానికి ఏ పని మీద వచ్చినది, ఎందుకు వచ్చినది తెలుసుకోవాలని, ఆయా అంశాలను పాయింట్ బుక్కుల్లో నమోదు చేయాలన్నారు. స్థానిక నాయకులు పోలీసు స్టేషనుకు వచ్చే ఫిర్యాదులను తమ రాజకీయ అవసరాలకు వాడుకునే అవకాశం ఉన్నందున, ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా, చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలన్నారు. ఈ.వి.ఎం.లను భద్రపర్చిన స్ట్రాంగు రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను ఇప్పటికే ఏర్పాటు చేసామని, వాటిని నిరంతరం అధికారులు తనిఖీలు చేపట్టి, భద్రతను పర్యవేక్షించాలన్నారు. రాబోయే 15 రోజులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏ చిన్న సంఘటనను తేలికగా తీసుకోవద్దని, రాజకీయాలకు అతీతంగా పని చేయాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, వివాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న గ్రామాలను, వ్యక్తులను గుర్తించి, ప్రత్యేకంగా నిఘా పెట్టాలని అధికారులను విశాఖపట్నం రేంజ్ డిఐజి శ్రీ విశాల్ గున్ని. ఐపిఎస్ ఆదేశించారు. అనంతరం, ఎన్నికల తరువాత వివిధ పోలీసు స్టేషనుల్లో నమోదైన కేసులను విశాఖ రేంజ్ డిఐజి సమీక్షించి, ఆయా కేసుల దర్యాప్తు ప్రగతిని సమీక్షించి, దర్యాప్తులో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించి, దర్యాప్తులో చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేసారు. జూన్ 4న జరిగే కౌంటింగు నిర్వహించే కేంద్రాల వద్ద కూడా భద్రత ఏర్పాట్లు చేపట్టాలని, వాటిని జిల్లా ఎస్పీలు ముందుగానే సమీక్షించాలని జిల్లా ఎస్పీలను విశాఖపట్నం రేంజ్ డిఐజి విశాల్ గున్ని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఎం. దీపిక , పార్వతీపురం మన్యం జిల్లా ఎన్పీ విక్రాంత్ పాటిల్ , శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక , అనకాపల్లి జిల్లా ఎస్పీ కే. వి.మురళికృష్ణ , ఎఎస్ఆర్ జిల్లా ఎస్పీ తుషీం సిన్హా, విజయనగరం అదనపు ఎస్పీలు శ్రీమతి అస్మా ఫర్వీన్ , శ్రీకాకుళం అదనపు ఎస్పీ శ్రీమతి ప్రేమ్ కాజల్, పార్వతీపురం మన్యం అదనపు ఎస్పీ ఒ.దిలీప్ కిరణ్, పార్వతీపురం ఎఎస్పీ శ్రీజ సునీల్ షరోన్, ట్రెయినీ ఐపిఎస్ ఎం. జావలి, డిఎస్పీలు పి.శ్రీనివాసరావు, ఆర్.గోవిందరావు, ఎ.ఎస్. చక్రవర్తి, జి. మురళీధర్, జి.వి.కృష్ణారావు, ఎస్.అప్పలరాజు, బి.అప్పారావు, కే.వి. సత్యన్నారాయణ, డి.బాలచంద్రా రెడ్డి, వై.సునీత, జి.నాగేశ్వరరెడ్డి, ట్రైనీ డిఎస్సీలు ఎస్.మహేంద్ర, సిహెచ్. రాజా, పలువురు సిబలు మరియు ఇతర పోలీసు అధికారులు నేరుగాను, జూమ్ మీటింగులో పాల్గొన్నారు.


TEJA NEWS