TEJA NEWS

అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈవీఎం ధ్వంసంతోపాటు, ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా ఈ మేరకు వాదనలు జరిగాయి. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన నాలుగు కేసుల్లో విచారణ చేపట్టారు. రెండు కేసుల్లో బెయిల్‌ మంజూరు కాగా, మరో రెండు కేసుల్లో రిమాండ్‌ విధించారు. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం, అడ్డుకోబోయిన తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌పై దాడి చేయడంపై పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం, అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు, అనుచరులపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు. ఈ నాలుగింటిలోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అయితే  ఇన్నాళ్లు అరెస్టు చేయకుండా ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొదట జూన్‌ 6 వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మే 28న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే 3 సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతి రోజూ ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు.
ఈ వెసులుబాటు గడువు ముగియడం, బెయిల్‌ పిటిషన్లనూ హైకోర్టు రద్దు చేయడంతో నరసరావుపేట మండలం రావిపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన్ను నరసరావుపేట రూరల్‌ సీఐ మల్లికార్జున్‌ అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి పోలీసు వాహనంలో కాకుండా పిన్నెల్లి సొంత కారులోనే ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఈ కేసులను విచారిస్తున్న గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు, కారంపూడి సీఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నరసరావుపేట ప్రభుత్వ ప్రధాన ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బందోబస్తు మధ్య నరసరావుపేట నుంచి గురజాల మీదుగా మాచర్ల కోర్టుకు తరలించారు.


TEJA NEWS