
ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి..
తెరుచుకున్న ఖమ్మం మధ్య గేటు
దీర్ఘకాలంగా మూత పడ్డ ఖమ్మం రైల్వే మధ్య గేటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఎట్టకేలకు తెరుచుకుంది. నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలను పునరుద్ధరించడంతో గాంధీ చౌక్, కమాన్ బజార్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్ లో మూడో ప్లాట్ ఫాం విస్తరణ పనులు జరుగుతున్న దృష్ట్యా మధ్య గేటును అధికారులు మూసివేశారు. దాదాపు 4 నెలల పాటు ఈ గేటు మూతపడటంతో.. గాంధీ చౌక్, కమాన్ బజార్ మధ్య వ్యాపార లావాదేవీలు మందగించాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య సరుకు రవాణా కు సైతం స్థబ్దత ఏర్పడింది. గేటు మూసివేతతో తాము పడుతున్న ఇబ్బందులను ఇరు ప్రాంతాల వ్యాపారులు ఎంపీ రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడమే కాకుండా.. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. మధ్య గేటు వద్ద బ్రిడ్జి నిర్మించాల్సిన ఆవశ్యకతపై ఆయనతో చర్చించారు.
ఈ సందర్భంగా వినతి పత్రం కూడా అందజేశారు. వద్దిరాజు వినతికి స్పందించిన రైల్వే మంత్రి మధ్య గేటు ప్రాంతంలో అండర్ పాస్ మంజూరు కు సాధ్యాసాధ్యలను పరిశీలించాలని ఉన్నతాధికారులకు అక్కడినుంచి ఆదేశాలు ఇచ్చారు. అప్పటి వరకు మూసి ఉన్న గేటు తెరిపించు, రాకపోకలు పునరుద్దరించాలని ఎంపీ రవిచంద్ర చేసిన విజ్ఞప్తి కి స్పందించి అధికారులు పనులు వేగవంతం చేశారు. ఎట్టకేలకు మధ్య గేటును సోమవారం రాత్రి ప్రయోగాత్మకంగా తెరిచి, మంగళవారం నుంచి పూర్తిగా రాకపోకలు పునరుద్దరించారు. తమ సమస్య పట్ల స్పందించి రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన ఎంపీ రవిచంద్ర కు గాంధీ చౌక్, కమాన్ బజార్ వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు.
