-ప్రతి గుమ్మాన్ని టచ్ చేయాలి
-కార్యకర్తలే రథసారధులు
-కార్యకర్తలపై ఈగ వాలినా సహించను
-నామను గెలిపించి, కేసీఆర్ కు మద్దతుగా నిలవాలి
-ఖమ్మంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
….
ప్రతి కార్యకర్త సుశిక్షితులైన సైనికుల్లా ప్రజా క్షేత్రంలో పని చేసి, తన విజయానికి శ్రమించాలని బీఆర్‌ఎస్ ఖమ్మం పార్లమెంటరీ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని మమత ఆస్పత్రి ప్రాంగణంలో మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన పార్టీ ఖమ్మం పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నామ మాట్లాడారు.బూత్ స్ధాయి, మండల స్ధాయి కమిటీలు వేసుకుని, ప్రతి ఇంటికి వెళ్ళి కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించి, చైతన్యపర్చి ఓట్లను సమీకరించాలని పేర్కొన్నారు. ప్రతి గుమ్మాన్ని సందర్శించి, అన్నదమ్ముల్లా పని చేసి తన గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యకర్తలే పార్టీ రధసారధులని, వారి కృషి వల్లనే తమకు పదవులు వచ్చాయని,వారి వల్లనే ఈ స్ధాయిలో ఉన్నామని అన్నారు.కార్యకర్తలపై ఈగ వాలినా సహించేదిలేదన్నారు. అధికారం లేకపోయినా వారికి ఈ అయిదేళ్లు అండగా ఉండి,కష్టకాలంలో ఆదుకుంటానని చెప్పారు.
పార్లమెంట్‌లో తెలంగాణ వాణి వినిపించే సత్తా ఒక్క బీఆర్‌ఎస్ ఎంపీలకు మాత్రమే ఉందని, ఆ రెండు పార్టీల వారు తెలంగాణ ప్రయోజనాలు గురించి పట్టవని, ఏనాడు పార్లమెంట్‌లో తెలంగాణ గురించిన మాట్లాడలేదని, కానీ ఇక్కడకు వచ్చి, ఓట్లు మాత్రం అడుతున్నారని అన్నారు. ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రస్ధుత సమయంలో తెలంగాణ గొంతుకలై మాట్లాడేందుకు బీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైనా ఉందని చెప్పారు. మాయ,మోసపు మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి తిలోదకాలు ఇచ్చిన అసమర్ద కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని నామ అన్నారు.కాంగ్రెస్ చేసిన మోసాన్ని గ్రహించిన ప్రజల్లో మార్పు వచ్చిందని, గ్రామ గ్రామాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టి,సమరోత్సాహంతో పని చేయాలన్నారు. అధికారంలో లేమని అధైర్యపడొద్దని,అయిదేళ్లు మీకు అండగా ఉండి, ఆదుకుంటానని నామ భరోసా నింపారు.దేనికీ భయపడే ప్రసక్తే లేదని,ఇప్పుడే జైలుకు వెళ్ళి పార్టీ కార్యకర్తలను కలిసి,ధైర్యం చెప్పి వచ్చానని స్పష్టం చేశారు.మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్యకర్తలు ఇక నిశ్ఛబ్ధాన్ని వీడి ప్రజాక్షేత్రంలోకి దూకి,నామ విజయానికి పని చేయాలని అన్నారు. కొందరు స్వార్ధంతో పార్టీని వీడిపోయినా నామ నాగేశ్వరరావు కష్టకాలంలో కేసీఆర్‌కు అండగా ఉండి,తనను నమ్ముకున్న ప్రజలతోనే ఉన్నారని, ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి, కేసీఆర్‌కు మద్దతుగా నిలవాలని అన్నారు.ప్రతి ఒక్కరూ గ్రామాల్లో ఎక్కడి వారు అక్కడ ఉవ్వెత్తున కదలి,నామకు విజయాన్ని చేకూర్చాలన్నారు.జాతిపిత లాంటి నాయకుడు కేసీఆర్ అని,రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దిన కేసీఆర్‌ను దూరం చేసుకున్నందుకు ఇప్పుడు ప్రజలు ఎంతో బాధపడుతున్నారని,చేసిన తప్పిదాన్ని గ్రహించి,ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ది చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని అన్నారు.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కేసీఆర్‌ను దూరం చేసుకున్నందుకు ప్రజలు నాలిక్కరుసుకుని బాధపడుతూ కసిగా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. కేసులకు భయపడే ప్రసక్తేలేదని, అందరం కలిసి సమైఖ్యంగా, సంఘటితంగా పని చేసి, నామ నాగేశ్వరరావును గతానికి మించిన మెజార్టీతో గెలిపించుకుందామని స్పష్టం చేశారు.నామ గెలిస్తే కేసీఆర్ సంతోషపడతారని,మనకు మంచి గౌరవం దక్కుతుందన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ గళాన్ని వినిపించి,తెలంగాణ ప్రయోజనాలు కాపాడిన నామ గెలుపు కోసం అందరం సర్వశక్తులు ఒడ్డి పని చేయాలని వద్దిరాజు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా పువ్వాడ అజయ్‌కుమార్ నేతృత్వంలో నామ నాగేశ్వరరావును, వద్దిరాజు రవిచంద్రను శాలువతో ఘనంగా సన్మానించారు.పార్టీ పట్టణ అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ మాజీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆర్జేసీ కృష్ణ, సుడా మాజీ ఛైర్మన్ బచ్చు విజయకుమార్, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ ఛైర్మన్ ఖమర్, పార్టీ జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్,మోతారపు సుధాకర్, పార్టీ రఘునాధపాలెం మండల అధ్యక్షులు వీరూనాయక్,కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, వలరాజు, రుద్రగాని శ్రీదేవి, జ్యోతిరెడ్డి, గాదె అమృత, ప్రసన్న, నాగండ్ల జ్యోతి, డోలే లక్ష్మీ, సరిపూడి సతీష్, రుద్ర ప్రదీప్, తోట ఉమారాణి, జశ్వంత్, రవి, మాటేటి అరుణ, ధనాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.