TEJA NEWS

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ..

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఇవాళ(శనివారం) ఉదయం వాయగుండంగా మారింది. దీంతో ఇవాళ, రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం బంగాళాఖాతంలోనే వాయుగుండం కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం, విశాఖపట్నం, గోపాల్ పూర్ తీర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట సహా పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వానలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం తీరే దాటే సమయంలో తెలంగాణలో గంటకు 30నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని తెలిపింది.


TEJA NEWS