TEJA NEWS

పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కారుపై రాత్రి బర్రింకలపాడు కూడలి దగ్గర దాడి జరగలేదని పోలీసులు తెలిపారు.. అది రాయి దాడి కాదని విచారణలో తేలిందన్నారు. ఎమ్మెల్యే నివాసం దగ్గర జరిగిన చిన్న తప్పుతో దాడి జరిగినట్లు భావించారని డీఎస్పీ తెలిపారు. దాడి జరిగిందనే ఫిర్యాదుతో క్లూస్‌ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర జరిగిన చిన్న తప్పును అక్కడ పనిచేసిన కూలీలు బయటపెట్టారు.ఎమ్మెల్యే బాలరాజు ఉదయం వేరే కారులో పోలవరం నియోజకవర్గ పర్యటనకు వెళ్లారు. ఆయన ఇంటి దగ్గర మరో కారు ఉండగా.. అక్కడే కూలీలు షెడ్డు నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇనుప రాడ్డు ఒకటి కారుపై పడటంతో అద్దం కొంత పగిలింది.. ఆ సమయంలోనే పగిలిన అద్దం రంధ్రంలోని నుంచి ఓ రాయి కారులో పడింది. అయితే ఎమ్మెల్యే బాలరాజు పర్యటన ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకోగా.. ఆయన సోదరుడు, మరో ఇద్దరు అనుచరులు అద్దం పగిలిన కారు తీసుకుని జీలుగుమిల్లి బయల్దేరి వెళ్లారు. ఇంతలో బర్రింకలపాడు కూడలి దగ్గర వేగంగా మలుపు తిప్పడంతో పాటు స్పీడ్ బ్రేకర్‌ను దాటించడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అద్దం పూర్తిగా పగిలింది.

ఈ ఘటనతో కారులో ఉన్న ముగ్గురు భయభ్రాంతులకు గురయ్యారు.. ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే బాలరాజుకు జరిగిన విషయాన్ని చెప్పారు. దీనికి తోడు కారులో రాయి ఉండటం.. అద్దం పగిలిపోవడంతో పొరబడిన వారు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని భావించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు..చివరికి ఇంటి దగ్గర చిన్న తప్పిదమే దీనికి కారణమని తేల్చారు. తాను పదేళ్లుగా ప్రజల్లో తిరుగుతూ సేవ చేస్తున్నానని.. తనపై ఎటువంటి దాడి జరగలేదని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. . తమకు శత్రువులెవరూ లేరని నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలే ఉన్నాయన్నారు. చిన్నపాటి పొరపాటు వల్లే ఇదంతా జరిగిందన్నారు. దీంతో జనసైనికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.


TEJA NEWS