మహిళా జర్నలిస్టులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే కి.. జైలు శిక్ష విధించిన కోర్టు

మహిళా జర్నలిస్టులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే కి.. జైలు శిక్ష విధించిన కోర్టు

TEJA NEWS

మహిళా జర్నలిస్టులపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే కి.. జైలు శిక్ష విధించిన కోర్టు

శివ శంకర్. చలువాది

కోలీవుడ్‌ ప్రముఖ సినీ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌కు కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరేళ్ల క్రిత్రం మహిళా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ కోర్టు దోషిగా తేల్చింది. నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు సోమవారం (ఫిబ్రవరి 19) తీర్పు వెలువరించించింది.

అసలేం జరిగిందంటే..

2018లో ఎస్వీ శేఖర్‌ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అప్పట్లో ఆయన సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను పంచుకున్నారు. తమిళనాడులోని మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని ఆ పోస్టులో ఆరోపించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. దీనితో ఆగ్రహించిన చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2018లో అప్పటి తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఓ మహిళా జర్నలిస్టు చెంపపై ఆమె అనుమతి లేకుండా కొట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొద్ది రోజుల తర్వాత ఎస్వీ శేఖర్‌ ఫేస్‌బుక్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా జర్నలిస్టులు నిరక్షరాస్యులు, తెలివిలేనివారు, అగ్లీ అంటూ పోస్టులో తెలిపాడు. మహిళా జర్నలిస్టు చెంపను తాకినందుకు గవర్నర్‌ ఫినైల్‌తో చేతులు కడుక్కోవాలని పోస్టులో పేర్కొన్నారు.

వ్యవహారంపై జర్నలిస్టుల సంఘం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) ఐపీసీలోని వివిధ సెక్షన్లు, తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయన మాజీ ఎమ్మెల్యే కావడంతో కేసు చెన్నైలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. విచారణలో మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు తేలింది. అయితే దీనిపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఎస్వీ శేఖర్‌ క్షమాపణలు తెలిపారు.

అయితే కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలంటూ శేఖర్‌ హైకోర్టును కూడా ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్‌ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్‌ ముందు విచారణకు వచ్చింది. వాదనలు ముగియడంతో సోమవారం తీర్పు వెలువరించారు.

ఐపీసీ సెక్షన్లు 504, 509 కింద, తమిళనాడు మహిళలపై వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద ప్రాసిక్యూషన్ నేరాన్ని రుజువు చేసినట్లు తెలిపారు. దీంతో నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష, రూ.15,000 జరిమానా కూడా విధించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌ తరఫు న్యాయవాది అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా శిక్షను సస్పెండ్ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు రెండు నుంచి నాలుగు వారాలలోపు ప్రయత్నాలు చేసుకోవచ్చని చెబుతూ, శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. కాగా 2023లో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్‌పై పలు క్రిమినల్ కేసులను కొట్టివేయడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఎస్వీ శేఖర్ ఏఐఏడీఎంకే నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కాంగ్రెస్‌లోకి మారాడు. ఆ తర్వాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నాడు.

Print Friendly, PDF & Email

TEJA NEWS