TEJA NEWS

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో నిర్మించిన అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దాదాపు 27 ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాప్స్‌ స్వామినారాయణ్‌ సంస్థ దీన్ని నిర్మించింది. ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ విశిష్ట అతిథిగా ఈ ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవానికి రంగం సిద్దమైంది. ప్రధాని ఇప్పటికే యూఏఈకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం.. 
బోచసన్వాసి అక్షర్‌పురుషోత్తం స్వామినారాయణ్‌ పేరిట అబుదాబిలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ హిందూ దేవాలయానికి ఏడు గోపురాలు ఉంటాయి. అరబ్‌ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు. రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. 402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు.. ఇలా అనేక శిల్పాలను చెక్కారు.
దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆలయం దిగువ భాగంలో పవిత్ర గంగా, యమునా నదీ ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్‌ లైట్లను ఏర్పాటు చేశారు. దుబాయి-అబుదాబి మార్గంలో 55వేల చదరపు మీటర్ల పరిధిలో దీన్ని నిర్మించారు. యూఏఈలో భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ ఆధ్వర్యంలో 42 దేశాలకు చెందిన రాయబారులు తమ జీవిత భాగస్వాములతో కలిసి అద్భుత ఆలయాన్ని సందర్శించారు.  ఈ సందర్భంగా సంజయ్‌ సుధీర్‌ మాట్లాడుతూ.. అసాధ్యమనుకున్నది వాస్తవరూపం దాల్చిందన్నారు. బాప్స్‌ హిందూ ఆలయ ప్రాజెక్టు చీఫ్‌ స్వామి బ్రహ్మవిహారి దాస్‌ ఆలయ చారిత్రక ప్రాముఖ్యత, నిర్మాణం, ఇతర అంశాలను వివరించారు.
అబుదాబిలోని BAPS హిందూ ఆలయం పశ్చిమాసియాలోనే అతి పెద్దది. 32.92 మీటర్లు (108 అడుగులు) ఎత్తు, 79.86 మీటర్లు (262 అడుగులు) పొడవు, 54.86 మీటర్లు (180 అడుగులు) వెడల్పుతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అత్యంత క్లిష్టమైన రీతిలో ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు జగన్నాథుడు, స్వామి నారాయణుడు, వేంకటేశ్వరుడు, అయ్యప్ప కథలను వర్ణించారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్‌ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాటర్‌ ఫీచర్లు, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు, గిఫ్ట్‌ షాపులు ఉంటాయి. మందిర్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది. భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు వంటి వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటాను సేకరిస్తాయి.


TEJA NEWS