TEJA NEWS

హైడ్రా దూకుడు..ఆరుగురు ఆఫీసర్ల అరెస్ట్కు రంగం సిద్ధం…!

హైదరాబాద్:

నాలాలు,
చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులను జైలుకు పంపేందుకు రంగం సిద్ధమైంది. హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ సిఫారసుతో స్పందించిన సైబరాబాద్​ సీపీ అవినాశ్​ మహంతి.. ఆరుగురిపై చర్యలకు డీసీపీ ప్రసాద్​ నేతృత్వంలోని ఎకనామిక్ అఫెన్స్​ వింగ్(ఈవోడబ్ల్యూ)కు బాధ్యతలు అప్పగించారు. హైడ్రా నుంచే పూర్తి ఆధారాలు అందడంతో ఆరుగురిపై కేసులు నమోదు చేసిన స్పెషల్​ వింగ్​.. సంబంధిత అధికారులను అరెస్ట్​ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

అధికారులు ఏం చేశారంటే..
బాచుపల్లి ఎర్రకుంటలోని చెరువు శిఖం భూమిని పట్టా భూమిగా చూపుతూ తహసీల్దార్‌ పూల్‌సింగ్‌ చౌహాన్‌ తప్పుడు నివేదిక ఇచ్చారు. దాన్ని చూపి.. నిర్మాణదారు హెచ్‌ఎండీఏ నుంచి ఎర్రకుంటలో లేఅవుట్‌కు అనుమతి పొందారు. అక్కడ నిర్మాణాలకు నిజాంపేట నగరపాలక సంస్థ కమిషనర్‌ రామకృష్ణారావు అనుమతి ఇచ్చారు. ఆ నిర్మాణాలను ఇటీవల హైడ్రా కూల్చివేసింది. చందానగర్‌ సర్కిల్‌ పరిధిలోని ఈర్ల చెరువులో మూడు భవనాలకు అనుమతి ఇవ్వడమే కాకుండా నిర్మాణం పూర్తవకముందే వాటికి ఆక్యుపేషన్​ సర్టిఫికెట్​ ఇచ్చారు. వాటిని హైడ్రా కూల్చింది. అనుమతులు ఇచ్చిన అసిస్టెంట్​ ప్లానింగ్​ ఆఫీసర్​ రాజ్‌కుమార్, సర్కిల్​ డిప్యూటీ కమిషనర్​ సుధాంశు ఇద్దరిపైనా చర్యలు తీసుకుంటున్నారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఓ చెరువు ఆక్రమణలపై సర్వే డిపార్ట్​ మెంట్​ కు చెందిన ఏడీ శ్రీనివాస్‌ తప్పుడు నివేదిక ఇచ్చారు. తగిన ఆధారాలతో హైడ్రా ఆయనపై ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ భూమి అని బోర్డు ఉన్న ఓ స్థలాన్ని పరిశీలించాక కూడా.. ఓనిర్మాణానికి హెచ్‌ఎండీఏ అసిస్టెంట్​ ప్లానింగ్​ ఆఫీసర్​ సుధీర్‌కుమార్‌ అనుమతి ఇచ్చారు. ఇలా ఆరుగురు అధికారులపై క్రిమినల్​ చర్యలకు రంగం సిద్ధమైంది. హైడ్రా కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత అధికారులపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి.


TEJA NEWS