సెగలు రేపుతున్న సూర్యుడు.. ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. తెలంగాణలో వాతావరణం కాస్త చల్లబడినప్పటికీ ఏపీలో మాత్రం భానుడు ఠారెత్తిస్తున్నాడు. ఏపీలోని 16 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి..అత్యధికంగా నిడమానూరులో 44.5 డిగ్రీలు నమోదైంది. ఇక నేడు, రేపు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. పలుచోట్ల 40 డిగ్రీలు దాటుతున్నాయి. మరోపక్క వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు..
ఉదయం పది గంటల నుంచే తీవ్రత కనిపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటితే ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉక్కపోతతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు..రానున్న రోజుల్లో ఇంకింత జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరముంటేనే బయటకు వెళ్లాలంటున్నారు.ఏప్రిల్ మొదట్లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, మే నెలల్లో మండుటెండలు ఏ రేంజ్‌లో ఉంటాయో అని జనం భయపడుతున్నారు.
కాగా మరోవైపు ఏపీ నీటి కొరతను కూడా ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలలు వర్షాభావం కారణంగా ట్యాంకర్లపై ఆధారపడి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్శిటీలు, కళాశాలలు కొరతను ఎదుర్కొంటున్నాయి. రోజుకు 4 ట్యాంకర్లు అవసరం ఉండటంతో పుత్తూరులోని ఫస్ట్ గ్రేడ్ మహిళా కళాశాల బోర్వెల్ నిధులను కోరుతోంది. ఇక ఏపీలోని ఆదివాసీ, ఏజెన్సీ ఏరియాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. ఏమాత్రం తాగునీటి వసతులు లేకపోవడంతో ఆదివాసీలు డోలీల ద్వారా కిలోమీటర్లు నడుచుకుంటు వెళ్తూ నీటిని తెచ్చుకుంటున్నారు.