ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గత మూడు రోజులుగా సాగిన ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పును రిజర్వ్ చేసి వచ్చే నెల 6న వెలువరించనున్నట్లు ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కొనసాగిన విచారణలో ఈడీ తరఫున జోయబ్‌హుస్సేన్ వాదనలు వినిపించారు. ‘ఇది తీవ్రమైన కేసు. మనీలాండరింగ్‌కు పాల్పడిన అనేక మంది నిందితులకు ట్రయల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని న్యాయస్థానాలూ బెయిల్ తిరస్కరించాయి. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మనీశ్ సిసోదియా బెయిల్ పిటిషన్‌ను అన్ని కోర్టులూ కొట్టేశాయి. ఈ కేసులో ఇప్పటికే ఒక ఛార్జిషీట్, 5 అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేశాం.
వాటన్నింటినీ కోర్టు పరిగణనలోకి తీసుకొంది. కోర్టు అనుమతితోనే నిందితులు శరత్‌చంద్రారెడ్డి, రాఘవ్ అప్రూవర్లుగా మారారు. వారిని అనుమానించడం అంటే కోర్టు నిర్ణయాన్ని తప్పుబట్టడమే. వారిపై కవిత చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ వాదనలే తప్ప అందులో పసలేదు. వారు రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు ఇచ్చారన్నది అప్రస్తుతం. ఈ కేసుతో వాటికి సంబంధం లేదు. కవితకు తాను బినామీగా పనిచేస్తున్నట్లు అరుణ్ రామచంద్రపిళ్లై వాంగ్మూలం ఇచ్చారు. దాని ఆధారంగా కవితకు నోటీసులు ఇచ్చిన వెంటనే.. పిళ్లై ఆ స్టేట్మెంట్ను వెనక్కు తీసుకున్నారు. కవిత ఒత్తిడితోనే ఆయనలా చేశారు.
ఇండో స్పిరిట్‌లో కవిత మేనల్లుడు మేకా శరణ్‌ను ఉద్యోగిగా పెట్టారు. అతను ఒక్కరోజు కూడా ఉద్యోగం చేయకపోయినా నెలకు రూ.లక్ష జీతం చెల్లించారు. అతడిని విచారణకు పిలిస్తే ఏడెనిమిది రోజులపాటు హాజరుకాలేదు. మద్యం విధానం రూపకల్పన, అందుకు ప్రతిఫలంగా ముడుపులు ముట్టజెప్పడంపై కవిత, కేజ్రీవాల్, మనీశ్ సిసోదియాల మధ్య ముందస్తు అవగాహన ఉన్నట్లు బుచ్చిబాబు వాంగ్మూలం ఇచ్చారు. కవిత చెప్పిన అంశాలే మద్యం విధానంలో పొందుపరిచారు. అప్రూవర్లుగా మారిన వారిని బెదిరించి.. ఇచ్చిన వాంగ్మూలాలను వెనక్కు తీసుకోవాలని నిందితురాలు ఒత్తిడి చేస్తున్నారు. ఆమె ఈడీకి పది ఫోన్లు ఇచ్చినట్లు చెబుతున్నా వాటిని ఫార్మాట్ చేసి ఇచ్చారు. అదేమని ప్రశ్నిస్తే కవిత నుంచి సమాధానం లేదు. వాటిని పనిమనుషులకు ఇచ్చినట్లు పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారు. పనిమనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారు? మార్చి 14, 15 తేదీల్లో ఆమె నాలుగు ఫోన్లు ఫార్మాట్ చేశారు. ఫోన్లను స్వాధీనం చేయాలని ఈడీ కోరిన తర్వాతే ఆ పని చేశారు. ఆధారాల ధ్వంసం, సాక్షుల బెదిరింపు చర్యలకు ఇవే ఉదాహరణలు. అందువల్ల ఆమెకు బెయిల్ ఇవ్వొద్దు’ అని ఈడీ తరఫు న్యాయవాది కోరారు….