TEJA NEWS

పాత్రికేయులు, కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం

★★ దాడులను ఖండించిన న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ)పల్నాడు జిల్లా అధ్యక్షుడు, జొన్నలగడ్డ విజయ్ కుమార్.

మొన్న అమరావతి…నిన్న రాప్తాడు…ఇప్పుడు కర్నూల్ లో ఈనాడు పాత్రికేయుడు , కార్యాలయం.,ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు లపై అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడటం అప్రజాస్వామికం అని జై భీమ్ రావ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి లో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యం నాలుగో స్తంభమైన మీడియా, ప్రతికా స్వేచ్ఛపై ఎన్నడూ లేని విధంగా అత్యంత హింసాత్మక, తీవ్ర దాడులు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి లో ఇసుక అక్రమ తవ్వకాలపై అధికార పార్టీ నాయకుల భాగోతం బయట పెట్టేందు వెళ్లిన న్యూస్ టుడే విలేకరి తేలప్రోలు పరమేశ్వరావు పై కొంత మంది హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. రాప్తాడు లో వైకాపా నిర్వహించిన సిద్ధం సభలో జనాల ఫోటోలు తీస్తున్న ఆంధ్రజ్యోతి పత్రిక ఫోటో జర్నలిస్టు శ్రీకృష్ణ పై దాడికి తెగబడ్డారని చెప్పారు. ఇప్పుడు కర్నూల్ లో అరాచక శక్తి గా మారిన ఓ నేత గురించి ఈనాడులో కధనం రాస్తే కార్యాలయంలో పై రాళ్లు విసిరి విధ్వంసానికి పాల్పడటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, పార్టీ నేతల అక్రమాలను బయటపెడుతున్నారని అక్కసుతో పాత్రికేయులు, వీడియో కార్యాలపైన దాడులు చేయడం తగదన్నారు. పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై దాడి చేయటమంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని పత్రికా స్వేచ్ఛను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ఇటువంటి దాడులు పై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ప్రభుత్వ ప్రాయోజిత హింసను అడ్డుకోకపోతే పత్రిక స్వేచ్ఛ అనే మాట మర్చిపోవటంతో పాటు పెను ప్రమాదం ముంచుకొస్తుందన్నారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేసి ఆయాఘటన బాధ్యులను గుర్తించి కఠిన శిక్ష పడేలాగా తమవంతుగా కృషి చేయాలని ఆయన కోరారు.


TEJA NEWS