కులగణన వెంటనే చేయాలని, ఫీజుల బకాయిలు వెంటనే చెల్లించాలని, ఈనెల 20వ తేదీన కలెక్టరేట్ల మరియు ఎమ్మార్వో ఆఫీస్ లో ముట్టడి చేస్తామని బిసి సంక్షేమ సంఘం హెచ్చరించింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ పంచాయతీరాజ్/సర్పంచ్/ఎంపీటీసీ/జడ్పిటిసి తదితర స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని, గత మూడు సంవత్సరాల ఫీజుల బకాయిలు 4500/- చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఈనెల 20న చలో కలెక్టరేట్ మరియు మండల ఆఫీసుల ముట్టడి కార్యక్రమం జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపునిచ్చింది.
- కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇంతవరకు కులగణన చేయడం లేదని, ఎన్నికల వాగ్దానం ప్రకారం బీసీ రిజర్వేషన్ 42 శాతానికి పెంచడం లేదని, రాహుల్‍గాంధీ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చరా? దిక్కరిస్తారా? అని ప్రశ్నించారు.
- కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల వాగ్దానం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. రాహుల్‍గాంధీ బీసీల గురించి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంపు గురించి మాట్లాడడంలేదు, అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
- సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50 శాతం సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీలులేదని, ఇప్పటికీ అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లను పెట్టి 50 శాతం సీలింగ్ పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసిందని, అగ్రకులాలకు రిజర్వేషన్లు పెంచడానికి మూడురోజులలో లోక్‍సభ, రాజ్యసభలలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు కానీ 50 శాతం జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా? మన దేశంలో బీసీలకు ఇదే న్యాయమా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం పెట్టవచ్చని అభిప్రాయపడ్డారు. అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని లేకపోతే గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని తెలిపారు.
- ఒకవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‍గాంధీ దేశవ్యాప్తంగా బహిరంగసభలలో ప్రతిరోజు కులగణనను జరుపుతామని, దాని ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని, బడ్జెట్ కేటాయిస్తామని, బీసీ ఎజెండా ఎత్తుకొని, బీసీల అభిమానం చూరగొంటుంటే, ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగు న్యాయమా అని ప్రశ్నించారు.
- గత మూడు సంవత్సరాల ఫీజుల బకాయిలు 4500 ఉన్నాయని వీటిని చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, బి.సి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మారిశెట్టి సూర్యప్రకాష్, బి.సి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బిసి సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు రాపర్తి రవి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ముద్దం గంగారెడ్డి, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.