TEJA NEWS

Nకన్వెన్షన్‌ బఫర్‌ జోన్‌లో కాదు చెరువులోనే కట్టారు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ బఫర్‌ జోన్‌లో కాదు చెరువులోనే నిర్మాణం చేపట్టారని అన్నారు . అక్రమ కట్టాడాలపై నోటీసులిచ్చాకే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం.

పదేళ్లలో చెరువులు ఎంత అక్రమణకు గురయ్యాయో అందరికీ తెలిసిందేనన్న భట్టి… చట్టానికి లోబడే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని చెప్పుకొచ్చారు. చెరువులు అక్రమాణకు గురికాకుండా ఉండేందుకే హైడ్రాను తీసుకువచ్చామన్న భట్టి.. కబ్జాలు, నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ ఫోటోలను ప్రజల ముందు ఉంచుతామని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పందించారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలోని ఆక్రమణలు కూల్చివేశారని చెప్పారు. తమ్మిడికుట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ ఒకటన్నారు. చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారన్న రంగనాథ్‌ .. బఫర్‌ జోన్‌లోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మించారని వెల్లడించారు. ఎన్‌ కన్వెన్షన్‌కు జీహెచ్‌ఎంసీ నుంచి నిర్మాణ అనుమతులు కూడా లేవని చెప్పుకొచ్చారు. హైకోర్టు స్టే ఇవ్వడం పూర్తిగా అవాస్తవమని.. ఎన్‌ కన్వెన్షన్‌పై ఎలాంటి స్టే లేదని తెలిపారు. ఎన్‌ కన్వెన్షన్‌ రిక్వెస్ట్‌ను గతంలోనే అధికారులు తిరస్కరించారని.. . ఎన్‌ కన్వెన్షన్‌లో పూర్తిగా కట్టడాలను నేలమట్టం చేశామని స్పష్టం చేశారు.

మరోవైపు ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా ఆధికారులు కూల్చివేయడంపై అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కూల్చివేతలు ఆపాలంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలు ఆపేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ తీర్పు వచ్చే లోపే హైడ్రా ఆధికారులు ఎన్ కన్వెన్షన్‌ను నెలమట్టం చేశారు.


TEJA NEWS