3 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా ఇందిరా డెయిరీ కార్యాచరణ చేపట్టాలి
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఇందిరా డెయిరీ గ్రౌండింగ్ కు వేగంగా కార్యాచరణ.. కలెక్టర్
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
3 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి లక్ష్యంగా ఇందిరా డెయిరీ కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ఇందిరా డెయిరీ పై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా డెయిరీ విజయవంతంగా నిర్వహణకు గాను పాల ఉత్పత్తి, పాల సేకరణ, మార్కెటింగ్ కి రవాణా కి పకడ్బందీ ప్రణాళిక చేయాలన్నారు. ఇదివరకే డెయిరీ లకు పాల సరఫరా చేస్తున్న వారికి, గేదెల పెంపకంలో అవగాహన ఉన్నవారికి, గేదెల షెడ్డు, పశుగ్రాసం లభ్యత ఉన్నవారికి మరో యూనిట్ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. మధిర నియోజకవర్గ పరిధిలో 8 నుండి 10 పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, కేంద్ర ఏర్పాటుకు కావాల్సిన మౌళిక సదుపాయాల కల్పన కు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పాల సేకరణ తర్వాత చిల్లింగ్ యూనిట్ కు తరలింపుకు కార్యాచరణ చేయాలన్నారు.
4 నుండి 5 వేల లీటర్ల పాల చిల్లింగ్ సామర్థ్యం గల చిల్లింగ్ యూనిట్ కి భవన గుర్తింపు చేసినట్లు, అట్టి భవనంలో చిల్లింగ్ యూనిట్ కై రెన్నోవేషన్ పనులు చేయాలన్నారు. వాహనాలు వచ్చి వెళ్ళేట్లు రోడ్ల నిర్మాణం చేయాలన్నారు. ఇందిరా డెయిరీ లో సభ్యత్వం కలిగిన 40 వేల మంది సభ్యులకు ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల వారిగా విభజన చేసి, ఆయా వర్గాల కార్పొరేషన్ల ద్వారా పాడి యూనిట్ల కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అన్నారు. పాడి గేదెల యూనిట్ల ఏర్పాటుకు కావాల్సిన సౌకర్యాల చెక్ లిస్ట్ రూపొందించి, గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. లబ్ధిదారులకు ఇదివరకే షెడ్డు, పశుగ్రాసానికి భూమి ఉన్నవారైతే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అధికారులు సమన్వయంతో కార్యాచరణ చేసి, డెయిరీ సక్సెస్ కి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సమీక్ష లో డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా పశుసంవర్ధక అధికారి వేణు మనోహర్, జిల్లా ఎస్సి సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి విజయలక్ష్మి, విజయ డెయిరీ ఉప సంచాలకులు మురళీమోహన్, ఇంచార్జ్ ఇడి ఎస్సి కార్పొరేషన్ నవీన్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.