నిర్ధేశించిన సమయంలో సమస్యలు పరిష్కరించాలి
పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో 23 అర్జీల స్వీకరణ
-ఎస్పీ డి. నరసింహా కిషోర్
రాజమహేంద్రవరం :
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నిర్వహించి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి, వారి కష్టాలను, బాధలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెనువెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసినదిగా ఉత్తర్వులు ఇచ్చారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు.
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అర్జీలకు నాణ్యతతోపాటు నిర్ధేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో చట్ట పరిధిలో వాటినీ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నేటి పోలీసు “పి.జి.ఆర్.ఎస్” కార్యక్రమానికి 23 ఫిర్యాదులు రాగా, వీటిలో సివిల్ కేసులు, కుటుంబ సమస్యల గురించి, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, దొంగతనం కేసులు మరియు ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించడమైనది. ఈ ప్రజా సమస్యల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో ఇన్స్పెక్టర్( ఎస్.బి) అనసూరి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ కె. మంగాదేవి, సబ్ ఇన్స్పెక్టర్ అలీ ఖాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.