TEJA NEWS

లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి.. చెక్కులు అందజేసిన ఎంపీ రఘురాం రెడ్డి

  • అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృత పర్యటన
  • స్థానిక ఎమ్మెల్యే తో కలిసి రూ.13 లక్షల చెక్కుల పంపిణీ

ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలు పొందిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం గురువారం స్వయంగా లబ్ధిదారుల ఇళ్ళకే వెళ్లి అందజేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి చంద్రుగొండ మండలంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దుద్దుకూరు, దామరచర్ల, అయ్యానపాలెం, చంద్రుగొండ, బెండలపాడు, తిప్పనపల్లి తదితర గ్రామాల్లో లబ్ధిదారులకు చెక్కులు అందజేసి.. వారి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గంలో 157 మందికి మొత్తం రూ. 13.50 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని..అన్ని రకాలుగా ఆదుకుంటామని అభయం ఇచ్చారు.

స్టేడియం నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎంపీ రామసహయం

అశ్వారావుపేట లో రూ.3 కోట్ల నిధులతో నిర్మించనున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భూమి పూజ చేశారు. వానలో సైతం శంకుస్థాపన కు వచ్చిన విద్యార్థులను ఎంపీ అభినందించారు. అనంతరం మాట్లాడుతూ..క్రీడా వేదికను అన్ని అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేస్తామని, ఇండోర్ బ్యాట్మెంటన్ కోర్టు నిర్మిస్తామని, క్రీడా అంశంలో కేంద్రం నుండి అన్నిరకాలుగా నిధులు తెస్తానని అన్నారు.
విద్యార్థులతో కలిసి..
పలు పాఠశాలల విద్యార్థులతో కలసి తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవంలో పాల్గొన్నారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదగాలని ఈ సందర్భంగా ఎంపీ రఘురాం రెడ్డి కోరారు.
ఈ కార్యక్రమాల్లో.. జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామ రెడ్డి, తహసిల్దార్ కృష్ణ ప్రసాద్, నాయకులు జూపల్లి రమేష్, కొప్పుల చంద్రశేఖర్, తుమ్మ రాంబాబు, చిన్నిశెట్టి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS