TEJA NEWS

వణికించిన వర్షం..

భద్రాచలంలో 2 గంటల్లోనే 6 సెంటీమీటర్ల వాన

డ్రైనేజీ ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి మృతి

గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా12.6 సెం.మీ.

కృష్ణా బేసిన్‌లో శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు తగ్గిన వరద

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన.. మంతా కొనసాగింది. కొన్ని చోట్ల అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షం పడడంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. రోడ్లపైన నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వణికిపోయింది. ముఖ్యంగా భద్రాచలంలో రెండు గంటల వ్యవధిలోనే ఆరు సెంటీమీటర్ల వర్షం కురవడంతో రామాలయ పరిసరాలు, నిత్యాన్నదాన సత్రంలోకి మీటరు మేర వర్షపు నీరు చేరింది. రామాలయం పడమర మెట్ల వైపు నుంచి ఆలయంలోకి ప్రవేశించేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చప్టా దిగువ ప్రాంతంలోని విస్తా కాంప్లెక్స్‌ స్లూయిజ్‌ వద్దకు భారీ వరద చేరడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రామాలయం సమీపంలోని కుసుమ హరినాథబాబా కల్యాణ మండపం ఒక వైపునకు ఒరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ శిథిలాలు ఇళ్లపై పడకుండా ఇనుప వైర్లు, పుల్లీల సహాయంతో చర్యలు చేపట్టారు. పట్టణంలోకి నీరు చేరడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటిని మోటార్ల ద్వారా తోడి గోదావరిలోకి పంపాలని అధికారులకు సూచించారు. కాగా, భద్రాచలానికి చెందిన సున్నం సతీష్‌(45) ప్రమాదవశాత్తు డ్రైయినేజీలో పడి కొట్టుకుపోయాడు. రాత్రి 8 గంటల సమయంలో అతడి మృతదేహాన్ని ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది బయటకు తీశారు. మరోవైపు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. సత్తుపల్లి మండలం గంగారంలో అత్యధికంగా 10.4, వేంసూరు మండలలో 6.6, పెనుబల్లిలో 5.9, ఖమ్మం అర్బన్‌లో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

సత్తుపల్లి మండలంలోని కిష్టారం-చెరుకుపల్లి, యాతాలకుంట-దిబ్బగూడెం, కొణిజర్ల మండలంలోని పల్లిపాడు-గుబ్బగుర్తి మధ్య వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సత్తుపల్లి రాజీవ్‌కాలనీలో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరింది. కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో అత్యధికంగా 7.5సెం.మీ వర్షపాతం నమోదైంది. కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. గద్వాల జిల్లాలోని గట్టులో 12.6 సెం.మీ. వర్షం కురవడంతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చాయి. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలో 7.1, నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలంలో 7.1, నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలో 6.4 సెం.మీ. వర్షం కురిసింది. ములుగు జిల్లాలోని వెంకటాపురంలో 8.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం మండలంలోని కొండాయి, మల్యాల, దొడ్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్‌లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పాకాల, ఆలిగేరు, కత్తెర, ముస్మి, పందింపుల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

ప్రాజెక్టులకు తగ్గిన వరద

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద క్రమంగా తగ్గుతోంది. సుంకేసుల, తుంగభద్ర, జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 2.8లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దిగువకు 3.74లక్షల క్యూసెక్కులను వదిలిపెడుతున్నారు. సాగర్‌కు అంతే మొత్తంలో నీరు చేరుతుండగా.. దిగువకు 2.7లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో మట్టపల్లి ఆలయ సమీపానికి నీరు చేరుకుంటోంది. ప్రాజెక్టు నుంచి 2.78లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరిలో వరద నిలకడగా కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి 3.62లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. వచ్చింది వచ్చినట్టే కిందకు వదిలేస్తున్నారు. ఎగువన శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టులోకి 11వేల క్యూసెక్కుల వరద వస్తోంది. కాగా, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.


TEJA NEWS