TEJA NEWS

తెలుగు భాషను విస్మరించడం తగదు
-తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి
-రాష్ట్రంలోని 26 జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలి
-అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాల వీరభద్రరావు
-రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టీ.కే.విశ్వేశ్వరరెడ్డి
రాజమహేంద్రవరం,
తెలుగు భాషను విస్మరించడం తగదని తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవాలని రాజమహేంద్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ టీ.కే.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) మరియు రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో టీ.కే.విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి తెలుగు భాషను వాడుక భాషగా ప్రజల జీవభాషగా ముందుకు తీసుకువెళ్లారని అన్నారు. అందుకే రామమూర్తి జయంతి రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. మాతృభాష తెలుగు భాషను విస్మరించడం అంటే కన్నతల్లిని కించపరచడమేనని, తెలుగు భాష చాలా గొప్పదని, తెలుగు పదాలు మాతృమూర్తి పాల వంటివని టీ.కే. అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా పునరుద్ధరించాలని అవసరమైతే దీనికోసం ఉద్యమం కూడా సాగిస్తామని టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు. తూ.గో.జిల్లా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు భాష మసకబారుతున్నదని, తెలుగు భాషను పరిరక్షించుకోవలసిన అవసరం ఆసన్నమైందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రంథాలయాలను బలోపేతం చేయాలని, రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన అన్ని జిల్లాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, ఉమ్మడి తూ.గో.జిల్లా విభజింపబడిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో, తూ.గో.జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని పడాల వీరభద్రరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టి. సత్య సౌందర్య, రచయితలు నన్నయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. ఆర్.ఎస్.వరహాల దొర, గండి స్వామి ప్రసాద్, ఎస్.ఆర్.పృథ్వి, డా. పి.వి.బి.సంజీవరావు, డా.బిహెచ్.వి.రమాదేవి, మల్లెమొగ్గల గోపాలరావు, లోలభట్టు శ్రీనివాసరాజు, గొట్టిముక్కల అనంతరావు, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, ఏ. రామకృష్ణ, ముండూరి మల్లికార్జునరావు,అంబడిపూడి కృష్ణ దత్తాత్రేయ శర్మ, రాజమహేంద్రి కళాశాల తెలుగు ఉపాధ్యాయులు ఏ.ఎల్.సావిత్రి, కే.లక్ష్మి, విభూతి బ్రదర్స్ కళాకారిణి వీర్నాల సుబ్బలక్ష్మిలను శాలువ కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. తొలుత రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అరసం జిల్లా కార్యవర్గ సభ్యురాలు తేతలి సత్య సౌందర్య జ్యోతి ప్రజ్వలన చేయగా…కళాశాల విద్యార్థినులు ప్రార్థనా గీతం ఆలపించారు. జనవిజ్ఞాన వేదిక తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముండూరి మల్లికార్జునరావు మాతృభాష తెలుగులోనే మాట్లాడాలని, తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటాలని ప్రమాణం చేయించారు. విభూతి బ్రదర్స్ జానపద కళాకారులచే విభూతి శ్రీనివాసరాజు బృందం మాతృభాష, తెలుగు తల్లి, గిడుగు రామ్మూర్తిపై పాడిన పాటలు సభను ఆకట్టుకున్నాయి. చివరగా పడాల వీరభద్రరావు వందన సమర్పణ చేశారు.


TEJA NEWS