ప్రతిపక్షంపై పగ.. ప్రజలకు దగా.. ఇదీ రేవంత్ రెడ్డి తీరు : హరీశ్‌రావు
మహబూబ్‌నగర్ : పరిపాలన చేయడం చేతకాక ఫ్రస్టేషన్లో తిట్ల పురాణం అందుకుంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ప్రతిపక్షంపై పగ పెంచుకుని, ప్రజలకు దగా చేస్తున్నాడు.. ఇదీ రేవంత్ రెడ్డి తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామిని దర్శించుకున్న అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.కనబడ్డ దేవుడు, మసీదు, చర్చి మీద ప్రమాణం చేసి రుణమాఫీ చేస్తానని మాట తప్పాడు. మాటతప్పి పాలమూరు పేరు చెడగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. అబద్ధాలు ఆడడమే రేవంత్ రెడ్డి డీఎన్ఏ. కేసీఆర్ ఆదేశిస్తే మూడుసార్లు రాజీనామా చేశాను. పంద్రాగస్టు లోపల పూర్తి రుణమాఫీ నువ్వు చేసుంటే రైతుల కోసం నేను రాజీనామా చేసేవాడిని. 10 ఏళ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన వాళ్ళం. ఎన్ని తిట్లు అయినా మేము భరిస్తాం కానీ ప్రజలను మోసం చేస్తే మాత్రం ఊరుకోం అని హరీశ్‌రావు హెచ్చరించారు.
నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డివి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డివి. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి రూ. 4 వేల కోట్లతో పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు అందించింది కేసీఆర్. 30 లక్షల నుండి కోటి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయికి తెలంగాణ చేరిందంటే అది కేసీఆర్ కృషి అని హరీశ్‌రావు పేర్కొన్నారు