TEJA NEWS

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ భేటీ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూ.ఎస్. కాన్సల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందున అభినందనలు తెలియచేసి జ్ఞాపిక అందచేశారు. ఉదయం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ నీ, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించారు.
ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందనీ, పెట్టుబడులను ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖమంత్రి తెలిపారు. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే నైపుణ్యం కలిగిన యువత రాష్ట్రంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన అవకాశాలు అందించడంలోనూ, ఉన్నత విద్యకు అమెరికా వెళ్ళేవారికీ తగిన సహకారం, మార్గనిర్దేశనం అందించాలని కోరారు. పర్యావరణహితమైన కార్యక్రమాలకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో యూ.ఎస్. కాన్సల్ పొలిటికల్, ఎకనామిక్స్ విభాగం చీఫ్ శ్రీ ఫ్రాంక్ టాలుటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీ శ్రీమాలి కారే, శ్రీ సిబప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS