ఒకరోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం
ప్రాధాన్యత క్రమంలో హామీలను అమలు చేస్తున్నాం
-ఇప్పటికే పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు అందించడంతోపాటు, అన్నా క్యాంటీన్ లను ప్రారంభించుకున్నాం
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం :
సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు.
స్థానిక ప్రకాశం నగర్ లో టిఎన్టీయూ సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు వై శ్రీను, అధికారులు తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతినెలా ఒకటో తేదీనే పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఆగస్టు నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే ఆగస్టు 31వ తేదీన అర్హులైన లబ్ధిదారులు అందరికీ పెన్షన్ అందజేస్తున్నామన్నారు.
ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు తెల్లవారు జాము నుంచే లబ్ధిదారుల ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. గత ప్రభుత్వంలో వివిధ కారణాల చేత లబ్ధిదారులకు తొలగించిన పెన్షన్ ను వారి అర్హత ఆధారంగా తిరిగి పెన్షన్ అందించే ప్రక్రియను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టనున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రాధాన్యత క్రమంలో హామీలను నెరవేర్చుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెంచిన పెన్షన్ లను లబ్ధిదారులకు అందిస్తున్నామని, అన్నా క్యాంటీన్ లను ప్రారంభించుకోవడం జరిగిందని, అదేవిధంగా యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై శిక్షణను అందిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.