నేటి నుంచి జి.జి.యు లో వాణి పథకంపై వర్క్ షాప్
-బ్రోచర్ ఆవిష్కరించిన జి.జి.యు ఉపకులపతి
రాజమహేంద్రవరం :
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఈ) ప్రారంభించిన వాణి పథకం పై గురువారం నుంచి రెండు రోజులపాటు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జిజియు )ప్రాంగణంలోని గైట్ అటానమస్ కళాశాలలో వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుందని ఉపకులపతి డాక్టర్ యు. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ వాహనాల వేస్ట్ బ్యాటరీ నుంచి పర్యావరణం పై పడుతున్న ఇటీవల పరిణామాలు అనే అంశంపై జి. జి .యు. లోని పెట్రోలియం విభాగం ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ జరుగుతుందని తెలిపారు. దీనికి దేశంలోనే ప్రఖ్యాతి చెందిన ధన్బాద్ లోని ఐఐటి ఐ.ఎస్.ఎం నుంచి, వెల్లూరులోని విఐటి నుంచి, విజయవాడలోని ఎస్ఆర్ఎం, ఫిక్కీ, హైదరాబాదులోని ఎన్.ఐ.ఆర్.డి.పి.ఎం ల నుంచి ప్రముఖులు హాజరై ఈ వర్క్ షాప్ లో కీలక ఉపన్యాసం ఇస్తారని చెప్పారు. అలాగే తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి విద్యార్థులు ,అధ్యాపకులు, పారిశ్రామికవేత్తలు ఈ వర్క్ షాప్ కు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ డాక్టర్ పి ఎంఎంఎస్ శర్మ, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. జయానంద కుమార్, డీన్ డాక్టర్ ఎన్. లీలావతి, పెట్రోలియం విభాగాధిపతి మరియు వర్క్ షాప్ కోఆర్డినేటర్ ఎండి. అహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.