TEJA NEWS

ప్రభుత్వంఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా

ఫీజు రియంబర్స్మెంట్ లేక పేద విద్యార్థులు చదువులకు దూరం
*
సాక్షిత వనపర్తి

ప్రభుత్వం కళాశాలల విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలు చెల్లించకపోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద వర్గాల విద్యార్థులు కళాశాల చదువులకు దూరం అవుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్, జిల్లా అధ్యక్షుడు నరేష్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కలెక్టర్ కార్యాలయం ఎదుట కళాశాల విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ముందుగా వనపర్తి కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిలు రూ. 7600 కోట్లు వెంటనే చెల్లించాలని నినాదాలు చేశారు. కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నా సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ రమేష్, జిల్లా అధ్యక్షుడు నరేష్, ఏఐటీయూసీ నేతలు శ్రీరామ్, గోపాలకృష్ణ మాట్లాడారు. పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాల పైన ఆధారపడుతున్నారన్నారు.


గత ఐదేళ్లుగా బకాయిలు విడుదల చేయక పోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులను వేధిస్తున్నాయన్నారు. పాసైన విద్యార్థులు పై చదువులకు వెళ్లేందుకు సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం లేదన్నారు. ఇటీవల 1560 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పిన ఇంతవరకు పైసా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ పద్ధతినే ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తుందని ఇది సరికాదన్నారు. వెంటనే బకాయిలు చెల్లించకుంటే విద్యార్థులకు సమీకరించి ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఆఫీసులో ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థి నాయకులు అరవింద్, భాను ప్రకాష్, చరణ్, గణేష్, జస్వంత్, బన్నీ, శివ యాదవ్, శివ ,భాను తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS