సహాయక చర్యలను తనికి జిల్లా కలెక్టర్
ఉమ్మడి ఖమ్మం
మున్నేరు వరద ముంపు ప్రాంతాలు బొక్కలగడ్డ, మంచికంటి నగర్, వెంకటేశ్వర నగర్, బతుకమ్మ ఘాట్ రోడ్డు, ప్రకాష్ నగర్, మోతీనగర్, వినాయక ఘాట్, కాలువకట్ట లలో చేపడుతున్న సహాయక చర్యలను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలిసి తనిఖీలు చేశారు. కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ పరిస్ధితులను పరిశీలిస్తూ బాధితులకు ధైర్యం కల్పించారు. అధైర్య పడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ ఇంటింటికి తిరిగి బాధితుల నష్టాన్ని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరదలు సృష్టించిన కష్టాలను కన్నీళ్ల చూస్తున్నట్లు, వాటినుండి సాధ్యమైనంత ఉపశమనం కల్గించేందుకు దగ్గరికి వచ్చామని వరద ముంపు బాధితులకు భరోసా ఇచ్చారు. కాలనీలలోని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు అందిస్తున్నామన్నారు.
వీధులలో పేరుకుపోయిన బురదను శానిటేషన్ సిబ్బందితో శుభ్రపరుస్తున్నట్లు తెలిపారు. ఇళ్లలలో తడిచిన బియ్యం, నిరుపయోగమైన వస్తువులను ట్రాక్టర్లతో ఎత్తివేసే పనులు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముంపు ప్రాంత నిరాశ్రయులకు తక్షణమే నిత్యవసర సరుకులు, దుప్పట్ల పంపిణీకి ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. ఆస్తి నష్టం అంచనాలు తయారు చేసేందుకు అధికారుల బృందం ప్రత్యేకంగా తిరుగుతున్నారని, తక్షణ పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రకృతి నష్టంతో జరిగిన ప్రమాదం కాబట్టి అందోళన చెందవద్దని, సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని ప్రజలకు ధైర్యాన్ని కల్పించారు. కలెక్టర్ మున్నేరు ప్రవాహం ను పరిశీలించారు. పైన నుండి వచ్చే వరదను అంచనా వేయాలని అధికారులకు అదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు వెన్నుదన్నుగా నిలవాలన్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమీషనర్ సంపత్, అధికారులు, తదితరులు ఉన్నారు.